Corona Virus: జనవరి 16 నుంచి దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్ పంపిణీ

Vaccination drive to start in next few days in country

  • ఇవాళ ప్రధాని మోదీ అధ్యక్షతన ఉన్నతస్థాయి సమావేశం
  • మరికొన్నిరోజుల్లో దేశంలో కరోనా వ్యాక్సినేషన్
  • మొదట ఆరోగ్య, పోలీసు, పారిశుద్ధ్య సిబ్బందికి వ్యాక్సిన్
  • ఆ తర్వాత 50 ఏళ్ల పైబడిన వారికి వ్యాక్సిన్
  • ఇతర వ్యాధులతో బాధపడుతున్నవారికి కూడా ప్రాధాన్యత

ప్రజలు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం భారత్ లో జనవరి 16న ప్రారంభం కానుంది. ఈ మేరకు కేంద్రం నిర్ధారించింది. వ్యాక్సిన్ పంపిణీ సన్నద్ధత కోసం ఇప్పటికే ఒక విడత డ్రై రన్ కార్యక్రమం చేపట్టిన కేంద్రం ప్రస్తుతం రెండో విడత డ్రై రన్ నిర్వహిస్తోంది. డ్రై రన్ లో వెల్లడయ్యే లోటుపాట్లను సవరించుకుని అసలైన వ్యాక్సిన్ పంపిణీ ప్రక్రియ అమలు చేయాలని కేంద్రం భావిస్తోంది.

అయితే, తొలి విడతలో దేశంలోని ముందువరుస యోధులైన ఆరోగ్య సిబ్బంది, పోలీసులు, పారిశుద్ధ్య సిబ్బందికి వ్యాక్సిన్ అందించనున్నట్టు కేంద్రం వెల్లడించింది. వీరి సంఖ్య 3 కోట్ల వరకు ఉంటుందని భావిస్తున్నారు. అనంతరం రెండో విడతలో 50 ఏళ్లకు పైబడిన వారికి, ఇతర వ్యాధులతో బాధపడుతున్న 50 ఏళ్ల లోపువారికి టీకా అందిస్తారు. వీరి సంఖ్య 27 కోట్ల వరకు ఉంటుందని అంచనా. ఆ తర్వాతే ఇతర ప్రజలకు వ్యాక్సిన్ ఇచ్చే అవకాశం ఉంది.

ఇవాళ ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన ఉన్నతస్థాయి సమావేశం జరిగింది. దేశంలోని కరోనా పరిస్థితులు, వ్యాక్సినేషన్ దిశగా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల సన్నద్ధతపై ఈ సమావేశంలో చర్చించారు. ఈ సమావేశం తర్వాత కేంద్రం వ్యాక్సిన్ పంపిణీపై వివరాలు తెలిపింది.

  • Loading...

More Telugu News