Sandalwood: అక్రమంగా నగదు బదిలీ ఆరోపణ: శాండల్‌వుడ్ నటి రాధిక కుమారస్వామిని ప్రశ్నించిన సీసీబీ

Kannada actor Radhika Kumaraswamy appears before Bengaluru police in cheating case

  • సోదరుడు రవిరాజ్‌తో కలిసి సీసీబీ కార్యాలయానికి
  • నిందితుడు యురాజ్ ఖాతా నుంచి పెద్ద ఎత్తున డబ్బు బదిలీ
  • సినిమా కోసమేనన్న రాధిక
  • ఐటీ, ఈడీ అధికారులు ప్రశ్నించే అవకాశం

శాండల్‌వుడ్ నటి రాధిక కుమారస్వామి నిన్న బెంగళూరు సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ (సీసీబీ) ఎదుట హాజరయ్యారు. ఓ చీటింగ్ కేసులో ప్రధాన నిందితుడికి, రాధిక మధ్య అక్రమంగా పెద్ద ఎత్తున నగదు బదిలీ అయిందన్న ఆరోపణలపై సీసీబీ అధికారులు ఆమెను ప్రశ్నించారు. తన సోదరుడు రవిరాజ్‌తో కలిసి చామరాజపేటలోని సీసీబీ కార్యాలయానికి చేరుకున్న రాధికను అధికారులు వివిధ కోణాల్లో ప్రశ్నించారు.

ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ పలువురి నుంచి లక్షలాది రూపాయలు వసూలు చేసి మోసం చేసిన ఆరోపణలపై గతేడాది డిసెంబరులో యువరాజ్ (52) అలియాస్ స్వామిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఆరెస్సెస్ కార్యకర్తగా చెప్పుకుంటూ ఆయనీ మోసాలకు  పాల్పడినట్టు పోలీసులు గుర్తించారు. ఈ కేసును దర్యాప్తు చేస్తున్న పోలీసులు నటి రాధిక కుమారస్వామి, యువరాజ్ మధ్య రూ. 75 లక్షల లావాదేవీలు జరిగినట్టు గుర్తించారు. దీంతో ఆమెను విచారించేందుకు సమన్లు జారీ చేశారు.  

సీసీబీ దర్యాప్తునకు హాజరైన రాధిక అనంతరం మాట్లాడుతూ..ఓ సినిమాకు సంబంధించి తన ఖాతాలో రూ. 60 లక్షలు జమ అయినట్టు చెప్పారు. అయితే, ఆ  సినిమా బృందంతో ఎలాంటి ముందస్తు ఒప్పందం లేకపోవడంతో ఆ డబ్బును వెనక్కి పంపించినట్టు చెప్పారు.

అంతకుముందు బుధవారం ఆమె మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. యువరాజ్ తనకు గత 17 ఏళ్లుగా తెలుసన్నారు. ఆయన తమ కుటుంబ జ్యోతిష్యుడని చెప్పారు. తన కెరియర్, జీవితం, తన తండ్రి మరణం గురించి ఆయన చెప్పినవన్నీ నిజమయ్యాయని పేర్కొన్నారు. అతడంటే తనకు ఎంతో విశ్వాసమని, గతేడాది అతడి అరెస్ట్ విషయం తెలిసి షాకయ్యానని పేర్కొన్నారు. కాగా, గతేడాది డిసెంబరు 16న యువరాజ్ నివాసంపై దాడులు చేసిన  సీసీబీ అధికారులు రూ. 91 కోట్ల విలువైన 100 చెక్కులను స్వాధీనం చేసుకున్నారు.  

యువరాజ్‌కు సొంత ప్రొడక్షన్ కంపెనీ ఉందని, ఓ చారిత్రక సినిమాలో ప్రధాన పాత్ర పోషించాలని తనను అడిగారని రాధిక తెలిపారు. తాను వెంటనే అంగీకరించానని చెప్పారు. దీంతో అడ్వాన్స్‌గా రూ. 15 లక్షలు పంపిస్తానని చెప్పి తన ఖాతాలోకి బదిలీ చేశారని వివరించారు. మిగతా సొమ్ము గురించి ప్రశ్నించగా, యువరాజ్ బావమరిది ఖాతా నుంచి మరో రూ. 60 లక్షలు తన ఖాతాకు ట్రాన్స్‌ఫర్ అయినట్టు రాధికా కుమారస్వామి వివరించారు. కాగా, ఈ కేసులో ఈడీ, ఐటీ అధికారులు కూడా రాధికను ప్రశ్నించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.

  • Loading...

More Telugu News