Mamata Banerjee: 100 శాతం సీటింగ్ తో సినిమాలు ప్రదర్శించుకోవచ్చు: మమత నిర్ణయం
- కోల్ కతా థియేటర్ల యాజమాన్యాలకు ఊరటనిచ్చే నిర్ణయం
- ఇప్పటికే 100 శాతం ఆక్యుపెన్సీకి పచ్చజెండా ఊపిన తమిళనాడు
- అసంతృప్తి వ్యక్తం చేసిన కేంద్రం
- మమత తాజా నిర్ణయంపై సర్వత్రా ఆసక్తి
కోల్ కతాలో సినిమా థియేటర్లు, మల్టీప్లెక్సుల యాజమాన్యాలకు సీఎం మమతా బెనర్జీ ఊరట కలిగించే నిర్ణయం వెలువరించారు. ఇకపై 100 శాతం ప్రేక్షకులతో సినిమాలు ప్రదర్శించుకోవచ్చని మమతా ప్రకటించారు. 26వ కోల్ కతా ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ ను ప్రారంభిస్తూ ఆమె ఈ సంగతి వెల్లడించారు.
ఓవైపు తమిళనాడు ప్రభుత్వం ఇలాగే 100 శాతం ఆక్యుపెన్సీకి అనుమతి ఇవ్వగా, కేంద్రం అందుకు అంగీకరించలేదు. పట్టుబట్టి తమిళనాడుతో ఆ ఉత్తర్వులు వెనక్కితీసుకునేలా చేసింది. ఇప్పుడు మమత తీసుకున్న నిర్ణయంపై కేంద్రం ఎలా స్పందిస్తుందన్నది ఆసక్తికరంగా మారింది.
మామూలుగానే, కేంద్రం, మమతల మధ్య సంబంధాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. కేంద్రం 50 శాతం ప్రేక్షకులతో సినిమా ప్రదర్శనలకు అనుమతి ఇవ్వగా, రాష్ట్రాలు 100 శాతం ప్రేక్షకులకు అనుమతులు ఇస్తుండడం ఒక విధంగా కేంద్రం మార్గదర్శకాలను ధిక్కరించడం కిందకే వస్తుంది. కరోనా కేసులు ఇంకా వస్తుండడంతో పాటు, దేశంలో కొత్త రకం కరోనా కలకలం సృష్టిస్తుండడంతో, కేంద్రం ఆంక్షలను ఈ నెల 31 వరకు పొడిగించింది. అప్పటివరకు 50 శాతం ప్రేక్షకులతోనే సినిమాలు ప్రదర్శించుకోవాలని స్పష్టం చేస్తోంది.