Sunder Pichai: క్యాపిటల్ భవనంపై జరిగిన దాడిని ఖండించిన సుందర్ పిచాయ్
- ఇది సిగ్గు పడాల్సిన రోజు
- ఈ దాడి ప్రజాస్వామ్యానికి విరుద్ధం
- దాడికి కారణమైన వారిని కఠినంగా శిక్షించాలి
అల్లర్లతో అమెరికాలోని వాషింగ్టన్ అట్టుడికిన సంగతి తెలిసిందే. ట్రంప్ మద్దతుదారులు క్యాపిటల్ భవనంపై చేసిన దాడితో యావత్ ప్రపంచం నివ్వెరపోయింది. పోలీసులు జరిపిన కాల్పుల్లో కొందరు ప్రాణాలు కూడా కోల్పోయారు. ఈ ఘటనను ఎంతో మంది తీవ్రంగా ఖండించారు. ఆల్ఫాబెట్ సీఈవో సుందర్ పిచాయ్ కూడా దీనిపై స్పందించారు.
వాషింగ్టన్ లో జరిగిన హింసను ఖండిస్తున్నామంటూ గూగుల్ ఉద్యోగులకు పంపిన మెయిల్ లో సుందర్ పిచాయ్ తెలిపారు. దేశ చరిత్రలోనే ఇది విచారకరమైన, సిగ్గుపడాల్సిన రోజు అని అన్నారు. ఈ ఘటనకు కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పారు. అమెరికా అధ్యక్ష బాధ్యతలను జోబైడెన్ తీసుకునే కార్యక్రమాన్ని సక్రమంగా పూర్తి చేయాలని కోరారు.
క్యాపిటల్ భవనంపై జరిగిన దాడి ప్రజాస్వామ్యానికి విరుద్ధమని సుందర్ పిచాయ్ అన్నారు. విభేదాలను శాంతియుతంగా పరిష్కరించడమే ప్రజాస్వామ్య పనితీరుకు పునాది అని చెప్పారు. మరోవైపు అధ్యక్ష ఎన్నికలలో బైడెన్ దే గెలుపని కాసేపటి క్రితం అమెరికా కాంగ్రెస్ ప్రకటించింది. దీంతో, అధికార మార్పిడికి తాను సహకరిస్తానని ట్రంప్ ట్వీట్ చేశారు.