Plots: పట్టణ, నగరాల్లోని మధ్యతరగతి జీవులకు తక్కువ ధరకే ప్లాట్లు... సీఎం జగన్ కీలక నిర్ణయం
- క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ సమీక్ష సమావేశం
- వివాదాల్లేని ఇళ్ల స్థలాల అందజేతకు నిర్ణయం
- ప్రభుత్వమే లే అవుట్లను అభివృద్ధి చేసే విధానం
- లబ్దిదారులకు క్లియర్ టైటిళ్లతో ఉన్న భూములు
- లాటరీ విధానంలో లబ్దిదారుల ఎంపిక
రాష్ట్రంలోని పట్టణాలు, నగరాల్లో నివసించే మధ్య తరగతి ప్రజలకు తక్కువ ధరలకు ఇళ్ల స్థలాలు అందించాలని ఏపీ సర్కారు భావిస్తోంది. ఈ నేపథ్యంలో సీఎం జగన్ సమీక్ష సమావేశం నిర్వహించి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. వివాదాల్లేని రీతిలో క్లియర్ టైటిళ్లతో తక్కువ ధరకే ప్లాట్లు అందించాలని నిర్ణయం తీసుకున్నారు. దీనికి సంబంధించిన విధివిధానాలపై ఆయన అధికారులకు దిశానిర్దేశం చేశారు.
దీనికి సంబంధించిన వివరాలు చూస్తే.... ప్రభుత్వమే లే అవుట్లను అభివృద్ధి చేసి, వాటిలోని ప్లాట్లను లబ్దిదారులకు కేటాయిస్తుంది. ప్రైవేటు వ్యక్తుల నుంచి కొన్న భూముల విషయంలో కొన్ని వివాదాలు ఏర్పడే అవకాశం ఉన్నందున, ప్రజలకు ఆ కష్టాల్లేకుండా లే అవుట్ల అభివృద్ధిని ప్రభుత్వమే చేపడుతుంది. అన్ని అనుమతులు, క్లియర్ టైటిళ్లతో ఉన్న భూములను ఇంటి స్థలాలుగా అప్పగిస్తుంది. ప్రభుత్వం లాభాపేక్ష చూసుకోకపోవడం వల్ల తక్కువ ధరలకే ఇంటి స్థలాలు అందుబాటులోకి వస్తాయి. అయితే, ఈ ప్లాట్లకు లబ్దిదారులను లాటరీ పద్ధతిలో ఎంపిక చేస్తారు. ఈ మేరకు సమీక్ష సమావేశంలో సీఎం జగన్ అధికారులకు స్పష్టం చేశారు.
తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ సమీక్ష సమావేశంలో రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, సీఎస్ ఆదిత్యనాథ్ దాస్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, అర్బన్ డెవలప్ మెంట్ విభాగం కార్యదర్శి శ్రీలక్ష్మి కూడా పాల్గొన్నారు.