Donald Trump: డొనాల్డ్ ట్రంప్ ను అభిశంసించే ఆలోచనలో యూఎస్ క్యాబినెట్!

US Cabinet to Remove Trump

  • నిరసనకారులకు మద్దతు పలికిన ట్రంప్
  • జాతి విద్రోహంగా పరిగణిస్తున్న మంత్రులు
  • రాజ్యాంగంలోని 25వ సవరణ తెరపైకి
  • ఉపాధ్యక్షుడు, మంత్రులు అంగీకరిస్తే ట్రంప్ అభిశంసన
  • చర్చలు జరుగుతున్నాయని యూఎస్ మీడియా వార్తలు

కాపిటల్ బిల్డింగ్ పై దాడికి దిగిన నిరసనకారులకు మద్దతును తెలియజేసిన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ను అభిశంసించే యోచనలో ఆయన క్యాబినెట్ సహచరులు ఉన్నట్టు తెలుస్తోంది. క్యాపిటల్ బిల్డింగ్ లో జరిగిన ఘటనలను అత్యంత తీవ్రంగా, జాతి విద్రోహంగా పరిగణిస్తున్న మంత్రులు, ఆయన్ను తక్షణం తొలగించేలా పావులు కదుపుతున్నట్టు మూడు యూఎస్ న్యూస్ చానెల్స్ బ్రేకింగ్ న్యూస్ వేశాయి.

అమెరికా రాజ్యాంగంలోని 25వ సవరణను వినియోగించుకోవాలని మంత్రులు భావిస్తున్నారు. ఈ అధికరణ ప్రకారం, అధ్యక్షుడిని ఉపాధ్యక్షుడు, క్యాబినెట్ మంత్రులు కలసి తొలగించవచ్చు. అధ్యక్షుడు తన విధులను సక్రమంగా నిర్వర్తించడం లేదని, అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నారని అత్యధికులు నమ్మాల్సి వుంటుంది. కాగా, ఈ ప్రక్రియ అంత సులువు కానప్పటికీ, అదే జరుగుతుందన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

ఇక ట్రంప్ కు సహచరుడిగా ముద్రపడ్డ వైస్ ప్రెసిడెంట్ మైఖేల్ పెన్స్, ఇతర క్యాబినెట్ మంత్రులతో సమావేశం జరిపి, ట్రంప్ అభిశంసనకు తీర్మానం చేస్తారా? అన్న విషయమై అనుమానాలు నెలకొన్నాయి. ట్రంప్ తొలగింపు విషయాన్ని రిపబ్లికన్ నేతలే స్వయంగా చెప్పారని సీఎన్ఎన్, సీబీఎస్ వంటి వార్తా సంస్థలు ప్రత్యేక కథనాలను ఇచ్చాయి.

కాగా, నవంబర్ తొలివారంలో జరిగిన ఎన్నికల్లో ట్రంప్ ఓటమిపాలైనా, తన ఓటమిని ఆయన అంగీకరించడం లేదన్న సంగతి తెలిసిందే. ఇక, నూతన అధ్యక్షుడిగా బైడెన్, మరో రెండు వారాల్లో బాధ్యతలు చేపట్టాల్సి వుంది. ఈ సమయంలో ఆయన్ను తదుపరి అధ్యక్షుడిగా ఎన్నుకొనేందుకు కాంగ్రెస్ సమావేశమైన వేళ, ట్రంప్ మద్దతుదారులు దాడికి దిగారు. పోలీసులు ఎదురుకాల్పులు జరుపగా, కనీసం నలుగురు మరణించినట్టు తెలుస్తోంది.

Donald Trump
USA
White House
Remove
Cabinet
  • Loading...

More Telugu News