BJP: ధర్మయాత్రను అడ్డుకున్న నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా బీజేపీ-జనసేన ఆందోళనలు
- బీజేపీ-జనసేన రామతీర్థం ధర్మయాత్రను అడ్డుకున్న పోలీసులు
- రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనకు పిలుపునిచ్చిన బీజేపీ
- ధర్నాల్లో పాల్గొన్న బీజేపీ, జనసేన శ్రేణులు
- తిరుపతిలో ఆర్డీవోను అడ్డుకున్న వైనం
- వెనుదిరిగిన ఆర్డీవో
రామతీర్థం ధర్మయాత్రను పోలీసులు అడ్డుకోవడంతో బీజేపీ రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలకు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఇవాళ బీజేపీ, జనసేన శ్రేణులు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఆందోళనలు చేపట్టాయి. తిరుపతి ఆర్డీవో కార్యాలయం వద్ద ఆ రెండు పార్టీల కార్యకర్తలు, నేతలు ధర్నాకు దిగారు. రామతీర్థం ధర్మయాత్రను అడ్డుకోవడాన్ని నిరసిస్తూ ఆందోళనకు దిగారు. ఈ క్రమంలో ఆర్డీవో వాహనాన్ని నిరసనకారులు అడ్డుకోవడంతో అక్కడ ఉద్రిక్తత ఏర్పడింది. ఈ క్రమంలో ఆర్డీవో అక్కడ్నించి వెనుదిరిగారు.
అటు, విజయవాడ ధర్నా చౌక్ లోనూ బీజేపీ, జనసేన నాయకులు ధర్నాకు దిగారు. ఈ సందర్భంగా రాష్ట్ర బీజేపీ నాయకత్వం స్పందిస్తూ, ఏపీలో ఆలయాలపై దాడులు పెరిగిపోయాయని ఆందోళన వ్యక్తం చేసింది. రామతీర్థం యాత్రకు విజయసాయిరెడ్డికి ఎలా అనుమతి ఇచ్చారని ప్రశ్నించింది. ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టాలని జగన్ కుట్రలు చేస్తున్నారని జనసేన ఆరోపించింది. దేవాదాయ శాఖ మంత్రి పదవి నుంచి వెల్లంపల్లిని వెంటనే తప్పించాలని డిమాండ్ చేసింది.