David Warner: క్రికెట్ స్టేడియంలోనూ వార్నర్ 'బుట్టబొమ్మ' డ్యాన్సు చేయడం ఆశ్చర్యమనిపించింది: అల్లు అర్జున్
- సామ్ జామ్ లో చెప్పిన అల్లు అర్జున్
- పాట వైరల్ కావడానికి వార్నర్ పాత్ర ఉందని వ్యాఖ్య
- యూనిట్ సభ్యుల పాత్ర కూడా చాలా ఉందన్న బన్నీ
'అల వైకుంఠపురములో' సినిమాలోని ‘బుట్టబొమ్మ’ పాట, డ్యాన్సు చాలా ఫేమస్ అయిపోయిన విషయం తెలిసిందే. ఇందులో అల్లు అర్జున్, పూజా హెగ్డే వేసిన స్టెప్పులు అదరగొట్టేశాయి. యూట్యూబ్‌లో ఈ పాట కోట్లాది వ్యూస్ సాధిస్తూ టాలీవుడ్ అభిమానులను ఖుషీ చేసింది. ఈ పాటకు ఆస్ట్రేలియా క్రికెటర్, ఐపీఎల్లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు కెప్టెన్ డేవిడ్ వార్నర్ తన భార్య క్యాండీస్ వార్నర్‌తో కలిసి డ్యాన్స్ చేయడంతో మరింత పాప్యులారిటీ సంపాదించింది.
ఆ తర్వాత కూడా ఆయన పలుసార్లు ఈ పాటకు స్టెప్పులు వేస్తూ కనపడ్డాడు. దీనిపై సామ్ జామ్ ప్రోగ్రాంలో బన్నీ స్పందించాడు. ఈ పాట ఇంతగా విజయవంతమవడానికి డేవిడ్ వార్నర్ కూడా కారణమని చెప్పాడు. అలాగే, ఆ పాట అంత సక్సెస్ కావడంలో యూనిట్ సభ్యుల పాత్ర కూడా చాలా ఉందని తెలిపాడు. అంతే సమానమైన పాత్ర వార్నర్‌కు కూడా ఉందని, టిక్‌టాక్ ద్వారా ఆ పాటను వార్నర్ వైరల్ చేశాడని చెప్పాడు. క్రికెట్ సిరీస్ సందర్భంగానూ స్టేడియంలో వార్నర్ ఆ పాటకు స్టెప్ వేయడం ఆశ్చర్యం కలిగించిందని అన్నాడు.