Narendra Modi: ఇది నిర్ణయాత్మక మలుపు... కరోనా వ్యాక్సిన్లకు డీసీజీఐ ఆమోదంపై మోదీ హర్షం
- కొవిషీల్డ్, కొవాగ్జిన్ వ్యాక్సిన్లకు డీసీజీఐ ఆమోదం
- జాతికి శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోదీ
- శాస్త్రవిజ్ఞాన, వైద్య రంగాలకు కృతజ్ఞతలు
- ఈ వ్యాక్సిన్లు భారత్ లోనే తయారవుతున్నట్టు వెల్లడి
ఆక్స్ ఫర్డ్-ఆస్ట్రాజెనెకా అభివృద్ధి చేసిన కొవిషీల్డ్ వ్యాక్సిన్ కు, భారత్ బయోటెక్-ఐసీఎంఆర్ రూపొందించిన కొవాగ్జిన్ వ్యాక్సిన్ కు నిపుణుల కమిటీ ఆమోదం తెలుపగా, డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ) కూడా తుది అనుమతులు ఇవ్వడంతో దేశంలో రెండు ప్రధాన వ్యాక్సిన్ల పంపిణీకి రంగం సిద్ధమైంది. దీనిపై ప్రధాని నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. రెండు వ్యాక్సిన్లు అందుబాటులోకి వచ్చిన నేపథ్యంలో జాతికి శుభాకాంక్షలు తెలిపారు. శాస్తవిజ్ఞాన, వైద్య రంగాలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
కొవిడ్-19 మహమ్మారిపై భారతదేశ స్ఫూర్తిదాయక పోరాటంలో కరోనా వ్యాక్సిన్లకు డీసీజీఐ అనుమతులు ఇవ్వడం నిర్ణయాత్మక మలుపు అని అభివర్ణించారు. భారత్ ను కరోనా రహితదేశంగా మలచడంలో డీసీజీఐ నిర్ణయం మరింత ఊపు అందిస్తుందని తెలిపారు. ఈ రెండు వ్యాక్సిన్లు భారత్ లోనే తయారవుతున్నందున ప్రతి భారతీయుడు గర్విస్తారని పేర్కొన్నారు.