Donald Trump: హెచ్1బీ వీసాలపై నిషేధం.. మరో మూడు నెలల పొడిగింపు
- అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆదేశాలు
- మార్చి 31 వరకు పొడిగిస్తూ ఉత్తర్వులు
- మార్కెట్లపై కరోనా భయాలు పోలేదని వెల్లడి
హెచ్1బీ, ఇతర వర్క్ వీసాలపై నిషేధాన్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో మూడు నెలలు పొడిగించారు. అమెరికా పౌరుల ప్రయోజనాలను కాపాడేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆయన ప్రకటించారు. 2020 డిసెంబర్ 31 వరకు అన్ని రకాల వర్క్ వీసాలపై నిషేధం విధిస్తూ అదే ఏడాది ఏప్రిల్ 22, జూన్ 22న ట్రంప్ ఆదేశాలిచ్చారు. ఇప్పుడు ఆ గడువు ముగియడానికి కొన్ని గంటల ముందే మార్చి 31 వరకు పొడిగిస్తూ ఉత్తర్వులిచ్చారు.
అమెరికా కార్మిక విపణిపై కరోనా కోలుకోలేని దెబ్బకొట్టిందని, ప్రస్తుతం దాని ప్రభావాలు ఇంకా పోలేదని ట్రంప్ అన్నారు. మహమ్మారి ఇంకా లక్షలాది మంది పొట్టకొడుతోందని అన్నారు. ఏప్రిల్ లో భారీగా ఉన్న నిరుద్యోగిత రేటు నవంబర్ నాటికి 6.7 శాతానికి తగ్గిందని చెప్పిన ఆయన.. 98.34 లక్షల మందిని మాత్రమే వ్యవసాయేతర ఉద్యోగాల్లో సర్దుబాటు చేశామని చెప్పారు. అయితే, వివిధ రాష్ట్రాలు విధించిన ఆంక్షలతో చాలా వ్యాపారాలపై దెబ్బ పడిందని, చాలా కంపెనీలు కొత్త వారిని తీసుకోవట్లేదని ఆయన చెప్పారు. ఈ నేపథ్యంలోనే కొత్త వీసాలపై నిషేధం పొడిగింపు తప్పనిసరి అనిపించిందన్నారు.
కాగా, జనవరి 20న అధ్యక్ష బాధ్యతలు తీసుకోబోతున్న జో బైడెన్.. ట్రంప్ నిర్ణయాన్ని ఖండించారు. అయితే, తానొచ్చాక ఆ ఆంక్షలను ఎత్తేస్తారా? లేదా? అన్నది మాత్రం చెప్పలేదు. మరోవైపు ట్రంప్ నిర్ణయంతో పెద్ద సంఖ్యలో భారతీయులు, ఇండియన్ అమెరికన్ కంపెనీలపై ప్రభావం పడనుంది.