sarpanch: ఇదో 'వేలం'వెర్రి.. రూ.2 కోట్లకు అమ్ముడుపోయిన సర్పంచ్ పదవి!
- నాసిక్ జిల్లాలోని ఉమ్రానే గ్రామంలో ఘటన
- రూ.కోటీ పదకొండు లక్షలతో ప్రారంభమైన వేలం
- ఆద్యంతం ఉత్కంఠభరితంగా కొనసాగిన వైనం
- ఆ డబ్బుతో ఆలయాన్ని నిర్మిస్తామన్న గ్రామస్థులు
ఎంపీ, ఎమ్మెల్యేల పదవుల కోసమే కాదు.. గ్రామ సర్పంచ్ పదవి కోసం కూడా దేశంలో అభ్యర్థులు కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్నారనడానికి ఈ ఘటనే ఉదాహరణ. మహారాష్ట్రలోని నాసిక్ జిల్లాలోని దేవ్లాలీ తాలూకాలోని ఉమ్రానే అనే గ్రామంలో సర్పంచ్ పదవికి గ్రామంలో వేలం వేశారు. గ్రామస్థులు అనధికారికంగా నిర్వహించిన ఈ వేలంలో రూ.2.05 కోట్లకు సర్పంచ్ పదవిని పాడుకుని విశ్వాస్ రావ్ దేవరా అనే వ్యక్తి ఆ పదవిని దక్కించుకున్నాడు. రూ.కోటీ పదకొండు లక్షలతో ప్రారంభమైన ఈ వేలం ఆద్యంతం ఉత్కంఠభరితంగా కొనసాగింది.
ఈ వేలంపాటలో గెలిచిన రావ్ దేవరాను ఎన్నికల ప్రక్రియ లేకుండానే సర్పంచిగా ప్రజలు ఏకగ్రీవంగా ఎన్నుకోనున్నారు. అయితే, వేలం ద్వారా వచ్చిన డబ్బుతో తమ గ్రామంలో రామేశ్వర స్వామి ఆలయాన్ని నిర్మిస్తామని తెలిపారు. కాగా, మహారాష్ట్రలో 34 జిల్లాల్లోని 14,234 గ్రామపంచాయతీలకు వచ్చేనెల 15 న ఎన్నికలు నిర్వహిస్తారు. కొన్ని గ్రామాల్లో సర్పంచ్ పదవుల కోసం బేరసారాలు జరుగుతుండడం ఎన్నికల ప్రక్రియ అపహాస్యం పాలవుతోంది. దీనిపై ప్రజాస్వామ్యవాదులు మండిపడుతున్నారు.