Andhra Pradesh: ఏపీలో కుక్కలు, పందులకు లైసెన్స్ ఉండాల్సిందే .. ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం!
- కుక్కలు, పందులకు లైసెన్స్ కంపల్సరీ
- లైసెన్స్ లేకపోతే రూ. 500 ఫైన్
- జంతువులకు టోకెన్లు జారీ చేయనున్న ప్రభుత్వం
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆసక్తికరమైన ఉత్తర్వులను జారీ చేసింది. పెంచుకునే కుక్కలు, పందులకు లైసెన్స్ ఉండాలంటూ పంచాయతీరాజ్, గ్రామాణాభివృద్ధి శాఖ ఆదేశాలను జారీ చేసింది. లైసెన్స్ లేని కుక్కలు, పందులను అధికారులు పట్టుకుంటే... వాటికి సంబంధించిన యజమానికి రూ. 500 ఫైన్ విధించనున్నారు. అంతేకాదు, రోజుకు రూ. 250 చొప్పున పెనాల్టీ వసూలు చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొంది.
ఒకవేళ అవి తమవంటూ ఎవరూ ముందుకు రాకపోతే... వాటిని వీధి కుక్కలు, పందులుగా గుర్తించి... వాటికి కుటుంబ నియంత్రణ చేస్తారు. కుక్కలు, పందులకు లైసెన్స్ ముగిసిపోతే... తిరిగి 10 రోజుల్లోగా లైసెన్స్ ను పునరుద్ధరించుకోవాల్సి ఉంటుంది.
యజమానులకు లైసెన్స్ అందించే సమయంలో వాటి హెల్త్ సర్టిఫికెట్లు కూడా అందించాలని ప్రభుత్వం తన ఉత్తర్వుల్లో తెలిపింది. ప్రభుత్వ వెటర్నరీ డాక్టర్ సర్టిఫికెట్ ను అందించాలని ఆదేశించింది. ఈ జంతువులకు టోకెన్లను జారీ చేయాలని తెలిపింది. ఈ టోకెన్లు వాటి మెడ చుట్టూ నిరంతరం వేలాడేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించింది.