Corona Virus: ఇండియాలో 'బ్రిటన్ కరోనా' వైరస్... ఆరుగురిలో ఆనవాళ్ల గుర్తింపు!
- యూకే నుంచి వచ్చిన 33 వేల మంది
- కొత్త వైరస్ ఎంత ప్రమాదకరమో అవగాహన లేదన్న వైద్యాధికారులు
- హైదరాబాద్ లో ఇద్దరికి చికిత్స
జన్యుమార్పులు పొందిన కరోనా వైరస్ ఇండియాలోకీ ప్రవేశించింది. యూకే నుంచి భారత్ కు వచ్చిన వారిలో కరోనా పాజిటివ్ సోకిన వారిని గుర్తించి, వారి నమూనాలను పరీక్షించగా, ఆరుగురిలో కొత్త స్ట్రెయిన్ వచ్చిందని, కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఈ వైరస్ 70 శాతం వేగంగా వ్యాపిస్తుందని, అయితే, వ్యాక్సిన్ తో దీన్ని నియంత్రించ వచ్చా అన్న విషయంలో మాత్రం ఇంకా స్పష్టత లేదని వైద్యాధికారులు వెల్లడించారు. ఇది ఎంత ప్రమాదకరమన్న విషయమై కూడా పూర్తి అవగాహనకు ఇంకా రాలేదని తెలిపారు.
కొత్త వైరస్ సోకిన వారిలో ముగ్గురిని బెంగళూరులోని నిమ్ హాన్స్ లో, ఇద్దరిని హైదరాబాద్ లోని సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయోలజీలోనూ, ఒకరిని పూణెలోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ వైరాలజీలోనూ ఉంచి చికిత్స అందిస్తున్నట్టు వెల్లడించారు. వీరందరినీ వేర్వేరు గదుల్లో ఉంచి చికిత్సను అందిస్తున్నామని, వారికి దగ్గరగా మసలిన వారినందరినీ క్వారంటైన్ చేశామని, సహ ప్రయాణికులు, వారి కుటుంబీకులను ట్రేస్ చేస్తున్నామని తెలిపారు.
కాగా, నవంబర్ 25 నుంచి డిసెంబర్ 23 మధ్య మొత్తం 33 వేల మందికి పైగా ప్రయాణికులు బ్రిటన్ నుంచి రాగా, వారిలో 114 మందికి కరోనా నిర్ధారణ అయింది. పరిస్థితిని నిశితంగా గమనిస్తున్నామని, కొత్త వైరస్ విషయంలో అన్ని రాష్ట్రాలనూ ఇప్పటికే అప్రమత్తం చేశామని, అన్ని శాంపిల్స్ నూ ఇన్సాకాగ్ ల్యాబ్ లకు పంపాలని ఆదేశించామని కేంద్రం పేర్కొంది. ఇప్పటివరకూ డెన్మార్క్, నెదర్లాండ్స్, ఆస్ట్రేలియా, ఇటలీ, ఫ్రాన్స్, స్పెయిన్, స్విట్జర్లాండ్, కెనడా, జపాన్, లెబనాన్, సింగపూర్, స్వీడన్ తదితర దేశాల్లో 'బ్రిటన్ స్ట్రెయిన్ కరోనా'ను గుర్తించారు.