One Nation: 'వన్ నేషన్, వన్ మొబిలిటీ కార్డ్'... ఎన్సీఎంసీ వచ్చేసింది!

NCMC Card Inaugurated by Modi

  • నందన్ నిలేకని ఆధ్వర్యంలో కమిటీ సిఫార్సులు
  • అన్ని రవాణా అవసరాలకూ ఒకే కార్డు
  • ఆవిష్కరించిన ప్రధాని నరేంద్ర మోడీ

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏర్పాటు చేసిన నందన్ నిలేకని ఆధ్వర్యంలోని కమిటీ ఇచ్చిన సిఫార్సుల మేరకు ఎన్సీఎంసీ (నేషనల్ కామన్ మొబిలిటీ కార్డ్) విధానం అమలులోకి వచ్చింది. ఢిల్లీ మెట్రో ఎయిర్ పోర్ట్ ఎక్స్ ప్రెస్ లైన్ లో ఈ సేవలను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు.

ఈ కార్డుదారులు అన్ని రవాణా అవసరాలనూ ఒకే కార్డు ద్వారా పొందవచ్చు. నందన్ నిలేకని ఆధ్వర్యంలోని యూఐడీఏఐ (ఆధార్) విజయవంతమైన తరువాత, పౌరుల అన్ని రకాల చెల్లింపులనూ డిజిటల్ మోడ్ లో చేసేలా ప్రోత్సహించడంతో పాటు నగదు లావాదేవీలను తగ్గించేందుకు కొత్త తరహా కార్డు ఉండాలన్న ఉద్దేశంతో ఆర్బీఐ ఈ కమిటీని ఏర్పాటు చేసింది.

ఇక గడచిన 18 నెలల కాలంలో 23 బ్యాంకులు జారీ చేసిన రూపే డెబిట్ కార్డులన్నీ ఎన్సీఎంసీ కార్డులే. ఇండియాలో అతిపెద్ద ఎస్బీఐతో పాటు యూకో బ్యాంక్, కెనరా బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్ తదితరాలు ఈ కార్డులను జారీ చేయగా, వీటిని స్వైప్ చేసి, ఎక్కడి నుంచి ఎక్కడికైనా ప్రయాణించే సౌలభ్యం కలుగనుంది. 2022 డిసెంబర్ నాటికి ఢిల్లీ మెట్రో నెట్ వర్క్ తో పాటు, దేశంలోని ఇతర నగరాల్లోని రైళ్లలో సైతం ఈ కార్డులను వాడుతూ సులువుగా ప్రయాణించ వచ్చని మెట్రో అధికారులు వెల్లడించారు.

ఇది ఆటోమేటిక్ ఫేర్ కలెక్షన్ సిస్టమ్ (ఏఎఫ్సీ) ఆధారంగా పనిచేస్తుంది. మెట్రోతో పాటు బస్, సబర్బన్ రైల్వే వ్యవస్థల్లోనూ టికెట్ కొనుగోలు చేసేందుకు క్యూలల్లో నిలవాల్సిన పని లేకుండా చేస్తుంది. స్మార్ట్ ఫోన్ సహాయంతోనూ పనిచేస్తుంది. మెట్రో స్టేషన్లలోకి వెళ్లేందుకు, తిరిగి వచ్చేందుకూ వీలును కల్పిస్తుంది.

ఏఎఫ్సీ విధానం సులువుగా సాగేందుకు ప్రభుత్వం భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ తో ఇప్పటికే ఒప్పందాన్ని కూడా కుదుర్చుకుంది. ఇక తామిచ్చే రూపీ డెబిట్ కార్డులను ఎన్సీఎంసీ కార్డులుగానూ వాడేందుకు అనుకూలంగా చేయాలా? అన్న విషయాన్ని బ్యాంకులు, తమ కస్టమర్లను అడిగి తెలుసుకుని, జారీ చేయాల్సి వుంటుంది.

  • Loading...

More Telugu News