Mamata Banerjee: రోడ్డు కోసం ఇచ్చిన భూమిని వెనక్కి తీసుకుంటున్నాం: శాంతినికేతన్‌పై మమతా బెనర్జీ ఆగ్రహం
- విశ్వభారతి యూనివర్శిటీకి రోడ్డు కోసం భూమి ఇచ్చిన ప్రభుత్వం
- శతాబ్ది ఉత్సవాలకు మమతను ఆహ్వానించని యూనివర్శిటీ
- బహిరంగంగానే అసంతృప్తిని వ్యక్తం చేసిన మమత
పశ్చిమబెంగాల్ లో రాష్ట్ర ప్రభుత్వానికి, విశ్వభారతి విశ్వవిద్యాలయానికి (శాంతినికేతన్) మధ్య వివాదం నెలకొంది. విశ్వభారతి యూనివర్శిటీకి గతంలో రోడ్డు కోసం కేటాయించిన స్థలాన్ని వెనక్కి తీసుకుంటున్నట్టు ఈరోజు మమతా బెనర్జీ ప్రభుత్వం ప్రకటించింది. శాంతినికేతన్ లో శాశ్వత నివాసం ఏర్పాటు చేసుకున్న వారు ప్రభుత్వ భూమిపై ఆధిపత్యం చెలాయిస్తూ.. వాహనాలను రోడ్డు మీదకు రానివ్వడం లేదని ఈ సందర్భంగా మమత మండిపడ్డారు.
మరోవైపు విశ్వభారతి యూనివర్శిటీ శతాబ్ది ఉత్సవాలకు మమతకు ఆహ్వానం అందలేదు. ఈ ఉత్సవాల్లో ప్రధాని మోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి తనను ఆహ్వానించకపోవడంపై మమత మండిపడ్డారు. బహిరంగంగానే తన అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఆ తర్వాత రోడ్డుకు సంబంధించి మమత ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.