Woman: మహిళకు హెచ్ఐవీ కలుషిత రక్తం.... కీలక ఆదేశాలు జారీ చేసిన కోర్టు
- 2018లో ఘటన
- రక్తహీనతతో బాధపడుతున్న గర్భిణీ
- ఆసుపత్రిలో హెచ్ఐవీ రక్తం ఎక్కించిన సిబ్బంది
- మహిళ తరఫున కోర్టులో ఫిర్యాదులు
- సానుభూతితో స్పందించిన న్యాయస్థానం
తమిళనాడులో ఓ మహిళకు కలుషిత రక్తం ఎక్కించిన ఘటనలో న్యాయస్థానం కీలక ఆదేశాలు జారీ చేసింది. జీవితకాలం ఆమెకు నెలసరి భత్యం అందించాలని ప్రభుత్వానికి స్పష్టం చేసింది. 2018లో విరుదునగర్ జిల్లా సత్తూర్ కు చెందిన ఓ గర్భవతి రక్తహీనతతో బాధపడుతూ ఆసుపత్రికి వెళ్లింది. అయితే ఆసుపత్రి వర్గాలు ఆమెకు ప్రాణాంతక హెచ్ఐవీ వైరస్ కూడిన రక్తాన్ని ఎక్కించాయి.
తదనంతర కాలంలో ఆమెకు హెచ్ఐవీ పాజిటివ్ అని వెల్లడైంది. 2019లో ఆమె ప్రసవించగా, బిడ్డకు వైరస్ సోకలేదని తేలింది. అయితే ఆమె పేద మహిళ కావడంతో కొందరు వ్యక్తులు ఆమె తరఫున కోర్టును ఆశ్రయించారు. చేయని తప్పుకు బలైన ఆ మహిళ పట్ల సానుభూతితో స్పందించిన న్యాయస్థానం... రూ.25 లక్షల నష్టపరిహారంతో పాటు ఓ ఇల్లు కూడా నిర్మించి ఇవ్వాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.
కాగా, ఆ మహిళ జస్టిస్ కిరుబాకరన్, జస్టిస్ పుగళేంది బెంచ్ ముందు హాజరై, అధికార వర్గాల నుంచి తనకు మరింత సాయాన్ని ఇప్పించాల్సిందిగా అర్థించింది. ప్రమాదకర వైరస్ తో బాధపడుతున్న తనను డాక్టర్లు బలవర్ధకమైన ఆహారం తీసువాలని స్పష్టం చేశారని, పండ్లు ఇతర పోషక పదార్థాలు తినాలని చెప్పారని న్యాయమూర్తులకు విన్నవించుకుంది. పేదరాలినైన తాను అంత ఖర్చులు భరించలేకపోతున్నానని, ప్రభుత్వాన్ని ఆదేశించి మరింత సాయం అందేలా చూడాలని కోరింది.
ఆమె విజ్ఞాపనను మన్నించిన న్యాయస్థానం... నెలకు రూ.7,500 చొప్పున ఆ మహిళకు సాయం అందించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. అంతేకాదు, ఆమెకు తగిన ఉపాధి కూడా కల్పించాలని స్పష్టం చేసింది.