Nashville: క్రిస్మస్ రోజున అమెరికాలో భారీ బాంబు పేలుడు

Bomb Blast in America Nashville Rocks

  • టెన్నెస్సీలోని నాష్‌విల్లేలో ఘటన
  • దెబ్బతిన్న కార్లు, భవనాలు
  • తెల్లవారుజామున జరగడంతో తప్పిన ముప్పు 

క్రిస్మస్ పర్వదినం రోజున అమెరికాలో బాంబు పేలుడు కలకలం సృష్టించింది. పేలుడు ధాటికి భవనాలు, వాహనాలు ధ్వంసమయ్యాయి. ప్రాణనష్టం లేకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. టెన్నెస్సీ రాష్ట్రంలోని నాష్‌విల్లేలో నిన్న ఉదయం ఆరున్నర గంటల సమయంలో ఈ ఘటన జరిగింది. నిలిపి ఉంచిన వాహనంలో దుండగులు అమర్చిన బాంబు పేలినట్టు పోలీసులు తెలిపారు.

పేలుడు ఘటనలో సమీపంలోని కొన్ని భవనాలు దెబ్బతినగా, కార్లు ధ్వంసమయ్యాయి. అలాగే, ముగ్గురు గాయపడినట్టు పోలీసులు పేర్కొన్నారు. కాగా, ఈ ప్రాంతానికి సమీపంలో కొన్ని మానవ అవశేషాలు కనిపించాయి. ఇవి పేలుడుకు పాల్పడిన దుండగుడివే అయి ఉండొచ్చని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంలో స్పష్టత రావాల్సి ఉంది.

కాగా, పేలుడు జరగడానికి ముందే అక్కడ కాల్పులు జరుగుతున్నట్టు గుర్తు తెలియని వ్యక్తి నుంచి పోలీసులకు సమాచారం అందింది. దీంతో అక్కడికి చేరుకున్న పోలీసులు గాలిస్తున్న సమయంలో మరో పావుగంటలో ఇక్కడ బాంబు పేలే ప్రమాదం ఉందన్న ఆడియో వినిపించింది. దీంతో అప్రమత్తమైన పోలీసులు సమీపంలోని ఇళ్లు, భవనాల నుంచి పలువురిని ఖాళీ చేయించారు. ఆ తర్వాత కాసేపటికే నిలిపి ఉంచిన వ్యాన్ పెద్ద శబ్దంతో పేలిపోయింది.

పేలుడు తెల్లవారుజామున జరగడం, అప్పటికే స్థానికులను ఖాళీ చేయించడంతో పెను ప్రమాదం తప్పింది. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పేలుడు ఘటనకు ఇప్పటి వరకు ఎవరూ బాధ్యత ప్రకటించలేదు.

  • Loading...

More Telugu News