Jaggery: అసలు బెల్లం.. కల్తీ బెల్లం.. వీటిని ఇలా గుర్తించండి!

How to differentiate Fake or Good Jaggery

  • పసుపు, ఎరుపు రంగుల్లోని బెల్లమూ కల్తీదే
  • వాటిలో కాల్షియం కార్బొనేట్, సోడియం బై కార్బొనేట్ వంటి రసాయనాలు
  • బెల్లాన్ని నీటిలో వేస్తే అడుగు భాగాన కల్తీ పదార్థాలు
  • ముదురు గోధుమ రంగులో ఉన్న బెల్లం ఒరిజినల్

పొద్దున పిల్లలు తాగే పాలు.. పెద్దలు తాగే టీ (పౌడర్) కల్తీ.. వంటల్లో వాడే అల్లం, కారం, మంచినూనె కల్తీ! ఒక్కటేంటి.. అదీ..ఇదీ అన్న తేడా లేకుండా అన్నింటినీ కల్తీ చేసేస్తున్నారు కొందరు కేటుగాళ్లు. వాళ్ల జేబులు నింపుకొనేందుకు ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. ఇప్పుడు ఆ కల్తీ జాబితాలోకి బెల్లం కూడా చేరిపోయింది. మరి, ఏది మంచి బెల్లమో.. ఏది కల్తీ బెల్లమో తెలుసుకోవడం ఎలా?

మామూలుగా బెల్లాన్ని చాలా మంది చలికాలంలో ఎక్కువగా వినియోగిస్తుంటారు. దాంట్లో ఉండే కొన్ని రకాల పోషకాలు ఒంటికి వెచ్చదనాన్ని ఇస్తాయన్న ఉద్దేశంతో తీపి వంటకాలు చేసుకుంటూ ఉంటారు. ఇదే అదునుగా భావిస్తున్న కొందరు.. బెల్లాన్ని కల్తీ చేస్తున్నారు. అసలు బెల్లాన్ని కొద్ది మొత్తంలో తీసుకుని.. దానికి ఎక్కువ పాళ్లలో కాల్షియం కార్బొనేట్, సోడియం బైకార్బొనేట్ వంటి రసాయనాలను కలుపుతున్నారు. కల్తీ బెల్లం బరువు ఎక్కువయ్యేందుకు కాల్షియం కార్బొనేట్ ను, దానికి రంగునిచ్చేందుకు సోడియం బైకార్బొనేట్ ను కలుపుతున్నారు.

దీంతో బెల్లం తెలుపు, పసుపు లేదా ఎరుపు రంగులోకి మారుతుంది. కాబట్టి ఆయా రంగుల్లో ఉన్న బెల్లం కల్తీదని అర్థం. ఈసారి ఎప్పుడైనా షాపుకెళ్లినప్పుడు ఆయా రంగుల్లో ఉన్న బెల్లాన్ని అసలు ముట్టుకోవద్దు. ముదురు గోధుమ రంగులో ఉన్న బెల్లాన్నే కొనాలి. ఎందుకంటే అదే ఒరిజినల్ బెల్లం మరి. నిజానికి బెల్లాన్ని తయారు చేసేటప్పుడు చెరకు రసంలోని మలినాలు, ఆ రసాన్ని మరిగించడం వల్ల బెల్లం ముదురు ఎరుపు రంగులో వస్తుంది. తర్వాత కొన్ని సహజసిద్ధమైన పదార్థాలను కలపడం ద్వారా ఆ మలినాలను తొలగిస్తారు.

ఇంటికి తెచ్చిన బెల్లం మంచిదా కాదా అని తేల్చేందుకు కొంచెం బెల్లాన్ని నీళ్లలో వెయ్యాలి. దాని వల్ల బెల్లాన్ని కల్తీ చేయడానికి కలిపిన పదార్థాలన్నీ నీటి అడుగుభాగంలో పేరుకుపోతాయి. ఒరిజినల్ బెల్లమంతా నీళ్లలో కరిగిపోతుంది. పేరుకున్న పదార్థాలు ఎక్కువగా ఉన్నట్టయితే అది కల్తీ బెల్లమని నిర్ధారించుకోవాలి. కాగా, బెల్లంలో కాల్షియం, ఫాస్ఫరస్, ఇనుము, పొటాషియం, జింక్, విటమిన్ బీ వంటి పోషకాలు మెండుగా ఉంటాయి. అవి మన ఒంట్లోని మలినాలను తీసేసి మనల్ని ఆరోగ్యంగా ఉంచుతాయి.

  • Loading...

More Telugu News