Honda: భారత్ లో రెండు మోడళ్ల ఉత్పత్తికి మంగళం పాడిన హోండా
- సివిక్, సీఆర్-వీ కార్ల తయారీకి స్వస్తి పలికిన హోండా
- గ్రేటర్ నోయిడా ప్లాంట్ లో నిలిచిన ఉత్పత్తి
- ప్లాంట్ ను రాజస్థాన్ కు తరలింపు
- ఈ రెండు మోడళ్ల విక్రయాలపై హోండా అసంతృప్తి
జపాన్ కార్ల తయారీ దిగ్గజం హోండా భారత్ లో రెండు మోడళ్ల తయారీకి స్వస్తి పలికింది. గ్రేటర్ నోయిడాలోని తన యూనిట్ లో సివిక్ (సెడాన్), సీఆర్-వీ (ఎస్ యూవీ) మోడళ్ల ఉత్పత్తిని నిలిపివేసింది. అంతేకాదు, తయారీ కేంద్రం మొత్తాన్ని రాజస్థాన్ లోని ఆళ్వార్ జిల్లా తపుకారా ప్లాంట్ కు తరలించేందుకు నిర్ణయించింది. సీఆర్-వీ, సివిక్ మోడళ్ల ఉత్పత్తిని నిలిపివేస్తున్నామని, తపుకారా ప్లాంట్ లో చిన్న, మీడియం సైజు కార్లను తయారుచేస్తామని హోండా కార్స్ ఇండియా విభాగం ప్రతినిధి వెల్లడించారు.
తమ సంస్థ తయారుచేసే కార్లలో ఈ రెండు మోడళ్లు విక్రయాల పరంగా అట్టడుగున ఉన్నాయని, గత 6 నెలల్లో కేవలం 850 సివిక్ కార్లు, 100 సీఆర్-వీ ఎస్ యూవీలను మాత్రమే విక్రయించగలిగామని తెలిపారు. అభివృద్ధి పరిచిన హోండా సిటీ, హోండా అమేజ్, జాజ్ వంటి మోడళ్లు వేల సంఖ్యలో అమ్ముడవుతున్న నేపథ్యంలో ఈ రెండు మోడళ్లు ఇక అందుబాటులో ఉండవని వివరించారు.