Jagan: సర్వేరాయిని పాతి ‘శాశ్వత భూ హక్కు– భూ రక్ష పథకం’ ప్రారంభించిన జగన్
- భూ వివాదాలకు శాశ్వతంగా ముగింపు పలికేందుకు పథకం
- ఏపీలో భూముల సమగ్ర రీసర్వే
- 2023 జనవరిలోగా పూర్తి
- రేపటి నుంచి ఏపీలోని ప్రతి జిల్లాలో రీసర్వే పనులు
భూ వివాదాలకు శాశ్వతంగా ముగింపు పలికేందుకు ‘వైఎస్సార్ జగనన్న శాశ్వత భూ హక్కు– భూ రక్ష పథకం’ పేరుతో ఏపీలో భూముల సమగ్ర రీసర్వే కార్యక్రమానికి ముఖ్యమంత్రి జగన్ శ్రీకారం చుట్టారు. కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలం తక్కెళ్లపాడులో సర్వేరాయి పాతి ఆయన ఈ పథకాన్ని లాంఛనంగా ప్రారంభించారు.
రాష్ట్ర వ్యాప్తంగా ఈ పథకం అమలు కానుంది. పైలట్ ప్రాజెక్టు కింద ఇప్పటికే రీసర్వే పూర్తయిన తక్కెళ్లపాడులో స్థిరాస్తి హక్కు పత్రాలను యజమానులకు సీఎం జగన్ అందజేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ సర్వేను మూడు దశల్లో చేపట్టి 2023 జనవరిలోగా పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. రేపటి నుంచి ఏపీలోని ప్రతి జిల్లాలో రీసర్వే పనులు ప్రారంభమవుతాయి.
తొలి దశలో 5,122 గ్రామాల్లో సర్వే చేపడతారు. రెండో దశలో 6000 గ్రామాల్లో సర్వే జరుగుతుంది. చివరి దశలో మిగిలిన గ్రామాల్లో ఈ సర్వే జరుపుతారు. దీని ద్వారా దీర్ఘకాలంగా నెలకొన్న భూ వివాదాలను పరిష్కరించవచ్చని ప్రభుత్వం భావిస్తోంది. ఏపీలోని గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని ఆస్తులను ప్రతి ఇంచు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కొలుస్తారు.