Mamata Banerjee: బీజేపీకి దీటైన సమాధానం ఇచ్చేందుకు... కేజ్రీవాల్, స్టాలిన్, పవార్ లను ర్యాలీకి ఆహ్వానిస్తున్న మమతా బెనర్జీ!
- ఐపీఎస్ ల బదిలీలను అడ్డుకున్న మమత సర్కారు
- మద్దతుగా నిలిచిన నలుగురు సీఎంలు
- విపక్ష నేతలతో భారీ ర్యాలీకి మమత ప్రణాళిక
- జనవరిలో కోల్ కతా వేదికగా ర్యాలీ
తన ఇలాకాలో దూకుడు మీదున్న బీజేపీకి అడ్డుకట్ట వేసేందుకు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ వచ్చే నెలలో భారీ ర్యాలీని నిర్వహించాలన్న ఆలోచనలో ఉన్నారు. ఐపీఎస్ అధికారుల బదిలీలను కేంద్రం తెరపైకి తేగా, దీనిని మమత సర్కారు వ్యతిరేకించిన సంగతి తెలిసిందే. మమత తీసుకున్న నిర్ణయాన్ని నలుగురు ముఖ్యమంత్రులతో పాటు డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్ సమర్ధించగా, వారందరికీ ఆమె కృతజ్ఞతలు తెలిపారు.
"రాష్ట్ర ప్రభుత్వ వ్యవహారాల్లో కేంద్రం కల్పించుకుంటోంది. బదిలీలను ఏకపక్షంగా చేస్తోంది. మా నిర్ణయాన్ని స్వాగతించిన భూషేష్ బాగెల్, అరవింద్ కేజ్రీవాల్, కెప్టెన్ అమరేందర్, అశోక్ గెహ్లాట్ లతో పాటు స్టాలిన్ కు నా ధన్యవాదాలు. వారంతా బెంగాల్ ప్రజల పక్షాన నిలబడ్డారు" అని ట్వీట్ చేశారు. ఇక వచ్చే నెలలో భారీ ర్యాలీని తలపెట్టిన ఆమె, దాన్ని విజయవంతం చేసేందుకు బీజేపీ వ్యతిరేక నేతలందరినీ ఆ వేదికపై నిలపాలని భావిస్తున్నారు. ఈ ర్యాలీకి ఎన్సీపీ నేత శరద్ పవార్ ను, ఇతర ప్రాంతీయ పార్టీల నేతలనూ ఆమె ఆహ్వానిస్తారని సమాచారం.
వీరిలో కొంతమంది ఇప్పటికే మమతా బెనర్జీ ఆహ్వానంపై సానుకూలంగా స్పందించారు. శరద్ పవర్ తాను కోల్ కతాకు వస్తానని హామీ ఇచ్చారు. కోల్ కతాలో నడ్డా పర్యటించిన వేళ, ఆయన కాన్వాయ్ పై రాళ్లదాడి జరిగిన ఘటనను తీవ్రంగా పరిగణించిన కేంద్రం, ముగ్గురు ఐపీఎస్ అధికారులను డిప్యుటేషన్ పై పంపాలని నిర్ణయించగా, మమతా బెనర్జీ ససేమిరా అన్న విషయం విదితమే.