C Kalyan: ఏపీ ప్రభుత్వం సినీ పరిశ్రమలో ఒక విభాగానికే వర్తించేలా రాయితీలు ప్రకటించడం సరికాదు: సి.కల్యాణ్
- టాలీవుడ్ రీస్టార్ట్ కు చర్యలు ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం
- అసంతృప్తి వ్యక్తం చేసిన సి.కల్యాణ్
- నిర్మాతలకు ప్రయోజనమేమీ లేదని వెల్లడి
- నిర్మాతల విజ్ఞప్తులను కూడా పరిగణించాలని వినతి
- త్వరలోనే తెలుగు రాష్ట్రాల సీఎంల కోసం ప్రత్యేక కార్యక్రమం
కరోనా ప్రభావంతో నష్టపోయిన సినీ పరిశ్రమ రీస్టార్ట్ అయ్యేందుకు తగిన ప్యాకేజి అంటూ ఏపీ ప్రభుత్వం ప్రకటించిన ఊరట చర్యలపై తెలుగు నిర్మాతల మండలి అధ్యక్షుడు సి.కల్యాణ్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రకటించిన రాయితీలు సినీ రంగంలో ఒక విభాగానికే వర్తించేలా ఉన్నాయని అన్నారు. థియేటర్ల విద్యుత్ బిల్లులు రద్దు చేయడం వల్ల నిర్మాతలకు వచ్చే ప్రయోజనం ఏంటని ప్రశ్నించారు. నిర్మాతల విజ్ఞప్తులను కూడా ఏపీ సీఎం జగన్ పరిశీలించాలని సి.కల్యాణ్ కోరారు.
తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన విధంగానే ఏపీ సర్కారు కూడా చిన్న సినిమాల అంశంలో ఆమోదయోగ్యమైన నిర్ణయం వెలిబుచ్చాలని విజ్ఞప్తి చేశారు. త్వరలోనే ఏపీ, తెలంగాణ సీఎంల కోసం ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేస్తామని చెప్పారు.
ఇటీవల ఏపీ కేబినెట్ సమావేశంలో సినీ రంగానికి సంబంధించి నిర్ణయాలు తీసుకున్న సంగతి తెలిసిందే. థియేటర్ల విద్యుత్ చార్జీలు, రుణాలు, రుణ చెల్లింపులపై మారటోరియం వంటి అంశాలపై ప్రకటన చేశారు.