Sonia Gandhi: అసమ్మతి నేతలతో భేటీ అయిన సోనియాగాంధీ
- 10 జన్ పథ్ కు చేరుకున్న అసమ్మతి నేతలు
- అసమ్మతి చెలరేగిన తర్వాత సోనియా నిర్వహిస్తున్న తొలి సమావేశం ఇది
- సమావేశానికి హాజరైన రాహుల్, చిదంబరం తదితరులు
పార్టీని సమూలంగా ప్రక్షాళన చేయాల్సిన సమయం ఆసన్నమైందని... పార్టీ అధ్యక్ష, సీడబ్ల్యూసీ పదవులకు కూడా అంతర్గతంగా ఎన్నికలను నిర్వహించాలంటూ 23 మంది కాంగ్రెస్ సీనియర్ నేతలు హైకమాండ్ కు రాసిన లేఖ కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఈ 23 మంది అసమ్మతి నేతలను జీ-23గా పిలుస్తున్నారు. ఎట్టకేలకు పార్టీలో చెలరేగిన ప్రకంపనలను సరిదిద్దే దిశగా హైకమాండ్ చర్యలు తీసుకుంది. అసమ్మతి నేతలతో పార్టీ అధినేత సోనియాగాంధీ చర్చలు జరుపుతున్నారు.
ఈ క్రమంలో ఢిల్లీలోని సోనియా నివాసం 10 జనపథ్ కు అసమ్మతి నేతలు చేరుకున్నారు. ఈ సమావేశంలో సోనియాకు నమ్మకస్తులైన ఏకే ఆంటోనీ, అశోక్ గెహ్లాట్, అంబికా సోనీలతో పాటు అసమ్మతి నేతలైన గులాం నబీ అజాద్, వివేక టంకా, ఆనంద్ శర్మ, శశి థరూర్, మనీశ్ తివారీ, భూపీందర్ సింగ్ హుడా తదితరులు హాజరయ్యారు. పి. చిదంబరం కూడా సమావేశానికి వచ్చారు.
కాంగ్రెస్ లో అసమ్మతి జ్వాలలు ఎగసిన తర్వాత సోనియాగాంధీ నిర్వహిస్తున్న తొలి సమావేశం ఇదే కావడం గమనార్హం. మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కమల్ నాథ్ వ్యక్తిగతంగా బాధ్యత తీసుకుని ఈ సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. ఆయన కూడా సమావేశానికి హాజరయ్యారు. రెబెల్స్ తో సోనియా చర్చలు జరిపేందుకు ఆయనే ఒప్పించారు.
రాహుల్ గాంధీ, ప్రియాంకాగాంధీ కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు. మరోవైపు పార్టీలో ట్రబుల్ షూటర్ గా పేరుగాంచిన అహ్మద్ పటేల్ ఇటీవలే మృతి చెందారు. ఆయన లేని లోటు ఈ సమావేశంలో స్పష్టంగా కనిపిస్తోంది. రానున్న 10 రోజుల పాటు వీరంతా వరుస సమావేశాలు నిర్వహించనున్నట్టు సమాచారం.