VK Sasikala: శశికళ విడుదలకు పరప్పణ జైలు అధికారుల సన్నాహాలు
- జైలు వద్ద పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు
- వచ్చే నెల 27 న రాత్రి 9 గంటలకు విడుదల?
- శశికళ కంటే ముందుగానే బయటకు రానున్న ఇళవరసి, సుధాకరన్
అక్రమాస్తుల కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న అన్నాడీఎంకే నేత, జయలలిత నెచ్చెలి శశికళ విడుదలకు బెంగళూరులోని పరప్పణ అగ్రహార జైలు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇదే కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న ఇళవరసి, సుధాకరన్‌లు శశికళ కంటే కొన్ని రోజుల ముందే విడుదలవనున్నట్టు తెలుస్తోంది.
ఈ నెలాఖరులో, లేదంటే వచ్చే నెల తొలి వారంలో సుధాకరన్, ఆ తర్వాత ఇళవరసి విడుదలకానున్నారు. జనవరి 27న శశికళను విడుదల చేయనున్నట్టు తెలుస్తోంది. సుధాకరన్, ఇళవరసిలను పగటిపూట విడుదల చేయనుండగా, శశికళను మాత్రం 27న రాత్రి 8-9 గంటల మధ్యలో విడుదల చేయాలని జైలు అధికారులు భావిస్తున్నారు.
శశికళను కనుక పగటిపూట విడుదల చేస్తే జైలు వద్ద రాజకీయ నాయకుల తాకిడి ఎక్కువగా ఉంటుందని భావిస్తుండడం వల్లే ఆమెను రాత్రివేళ విడుదల చేయాలని అధికారులు నిర్ణయించినట్టు సమాచారం. ఈ మేరకు ఇంటెలిజెన్స్ నుంచి జైలు అధికారులకు సమాచారం అందినట్టు తెలుస్తోంది.
శశికళ జైలు నుంచి విడుదలయ్యే రోజున జైలు పరిసరాల్లో ఏర్పాటు చేయాల్సిన భద్రతా చర్యలపై అధికారులు ఇప్పటికే సమీక్షించారు. జైలు వద్ద జనం పెద్ద ఎత్తున గుమికూడకుండా చుట్టూ బారికేడ్ల ఏర్పాటు, మూడువైపుల పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. శశికళకు స్వాగతం పలికేందుకు వాహనాల్లో వచ్చే వారిని జైలుకు రెండు కిలోమీటర్ల దూరంలోనే ఆపివేయాలని ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు అందాయి.