Yogi Adityanath: రామ మందిరంపై కోపాన్ని రైతుల ముసుగులో తీర్చుకుంటున్నారు: యోగి ఆదిత్యనాథ్
- రామ మందిర నిర్మాణం ప్రారంభం కావడాన్ని విపక్షాలు తట్టుకోలేకపోతున్నాయి
- రైతులను తప్పుదోవ పట్టిస్తున్నాయి
- కమ్యూనిజంలో నిజం ఎప్పుడూ లేదు
విపక్షాలపై ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ మండిపడ్డారు. రైతుల మాటున విపక్షాలు దేశంలో అశాంతిని రేకెత్తించే ప్రయత్నం చేస్తున్నాయని విమర్శించారు. రామ మందిర నిర్మాణంపై ఉన్న కోపాన్ని రైతుల నిరసనల వెనుక తీర్చుకుంటున్నాయని అన్నారు.
మన దేశం శ్రేష్ట్ భారత్ కావడం, ఏక్ భారత్ కావడం ప్రతిపక్షాలకు ఇష్టం లేదని దుయ్యబట్టారు. ఈ విషయాన్ని రైతుల ధర్నాలో తాను చూశానని చెప్పారు. కనీస మద్దతు ధర కోసం పట్టుబడుతున్నారని... ఆ విషయంలో వెనక్కి తగ్గబోమని ప్రభుత్వం చెపుతూనే ఉందని... అలాంటప్పుడు రైతులను విపక్షాలు ఎందుకు పక్కదోవ పట్టిస్తున్నాయని ప్రశ్నించారు.
రామ మందిర నిర్మాణాన్ని మోదీ ప్రారంభించడంతో విపక్ష నేతలు ఆగ్రహంతో ఊగిపోతున్నారని యోగి అన్నారు. అందుకే కేంద్రానికి వ్యతిరేకంగా రైతులను తప్పుదోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు. ఒక అబద్దాన్ని వంద సార్లు చెపితే నిజమని నమ్మే అవకాశం ఉంటుందని... విపక్షాలు ఇప్పుడు ఆ పనిలోనే ఉన్నాయని అన్నారు. కమ్యూనిజంలో నిజం ఎప్పుడూ లేదని విమర్శించారు.