Jagan: కేంద్ర జల శక్తి మంత్రి గజేంద్ర సింగ్‌ను కలిసిన సీఎం వైయస్ జగన్
- పోలవరం ప్రాజెక్టుకు సాయం చేయాలని కోరిన జగన్
- పెంచిన అంచనాలను ఆమోదించాలని విన్నపం
- పెండింగ్ బిల్లులను రీయింబర్స్ చేయాలన్న సీఎం
ఢిల్లీ పర్యటనలో ఉన్న ఏపీ ముఖ్యమంత్రి జగన్ కేంద్ర మంత్రులతో భేటీ అవుతున్నారు. కాసేపటి క్రితం కేంద్ర జలశక్తి మంత్రితో ఆయన సమావేశం ముగిసింది. కేంద్రమంత్రితో భేటీ సందర్భంగా పోలవరం ప్రాజెక్టుకు సాయం చేయాల్సిందిగా జగన్ కోరారు.
ప్రాజెక్టుకు సంబంధించి పెంచిన అంచనాలను ఆమోదించాలని విజ్ఞప్తి చేశారు. అలాగే, పునరావాస ఖర్చును రీయింబర్స్ చేయాలని కోరారు. 2005-06తో పోలిస్తే 2017-18 నాటికి అక్కడి నుంచి తరలించాల్సిన కుటుంబాల సంఖ్య 44,574 నుంచి 1,06,006కి పెరిగిందని చెప్పారు. దీంతో ఆర్ అండ్ ఆర్ కోసం పెట్టాల్సిన ఖర్చు భారీగా పెరిగిందని తెలిపారు.
రాష్ట్ర ప్రభుత్వం చేసిన ఖర్చులో రూ. 1,779 కోట్లు రీయింబర్స్ చేయాల్సి ఉందని... 2018 డిసెంబర్ కు సంబంధించిన ఈ బిల్లులు ఇంకా పెండింగులో ఉన్నాయని జగన్ చెప్పారు. ప్రాజెక్టు నిర్మాణం ఆలస్యమయ్యే కొద్దీ ఖర్చు పెరిగిపోతుందని తెలిపారు. మరోవైపు గోదావరి-కావేరి నదుల అనుసంధానంపై చర్చించేందుకు జలశక్తి శాఖ సలహాదారు శ్రీరామ్ ను రాష్ట్రానికి రావాలని జగన్ ఆహ్వానించారు.