Andhra Pradesh: తెలుగు రాష్ట్రాల ప్రధాన న్యాయమూర్తుల బదిలీ.. తెలంగాణకు హిమా కోహ్లీ.. ఏపీకి అరూప్ కుమార్!
- ఏకకాలంలో తెలుగు రాష్ట్రాల హైకోర్టు సీజేలను బదిలీ చేసిన సుప్రీంకోర్టు కొలీజియం!
- జస్టిస్ జీకే మహేశ్వరి సిక్కింకు, జస్టిస్ ఆర్‌ఎస్ చౌహాన్ ఉత్తరాఖండ్‌కు బదిలీ
- ఏపీ హైకోర్టుకు కలక్తతా నుంచి మరో న్యాయమూర్తి
తెలుగు రాష్ట్రాల హైకోర్టులకు కొత్త ప్రధాన న్యాయమూర్తులు రానున్నారు. ప్రస్తుత న్యాయమూర్తులను ఏకకాలంలో బదిలీ చేస్తూ సుప్రీంకోర్టు కొలీజియం నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. అయితే, ఇందుకు సంబంధించి అధికారిక ఉత్తర్వులు విడుదల కావాల్సి ఉంది. ప్రస్తుతం ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్ జీకే మహేశ్వరిని సిక్కింకు, తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి రాఘవేంద్రసింగ్ చౌహాన్‌ను ఉత్తరాఖండ్ హైకోర్టుకు పంపుతున్నట్టు సమాచారం.
ఢిల్లీ హైకోర్టు సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ హిమా కోహ్లీని తెలంగాణకు, సిక్కిం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అరూప్ కుమార్ గోస్వామిని ఏపీ హైకోర్టుకు ప్రధాన న్యాయమూర్తులుగా రానున్నట్టు తెలుస్తోంది. తెలంగాణ హైకోర్టు ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాఘవేంద్రసింగ్ 23 జూన్ 2019 నుంచి సేవలు అందిస్తుండగా, ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జీకే మహేశ్వరి 7 అక్టోబరు 2019 నుంచి సేవలు అందిస్తున్నారు.
జస్టిస్ చౌహాన్ తెలంగాణకు రెండో ప్రధాన న్యాయమూర్తి కాగా, జస్టిస్ మహేశ్వరి నవ్యాంధ్రకు తొలి ప్రధాన న్యాయమూర్తి. కాగా, కలకత్తా హైకోర్టులో 27 జూన్ 2011 నుంచి శాశ్వత న్యాయమూర్తిగా పనిచేస్తున్న జస్టిస్ జోయ్‌మాల్యా బాగ్చిని కూడా ఏపీ హైకోర్టుకు బదిలీ చేసే యోచన ఉన్నట్టు సమాచారం.