Mushfiqur Rahim: మైదానంలో బంగ్లాదేశ్ మాజీ కెప్టెన్ అనుచిత ప్రవర్తన
- క్యాచ్ అందుకునేందుకు ప్రయత్నించిన ముష్ఫికర్ రహీమ్
- అడ్డొచ్చాడంటూ మరో ఆటగాడిపై ఆగ్రహం
- కొట్టినంత పనిచేసిన రహీమ్
- ఏకిపారేసిన నెటిజన్లు
- క్షమాపణలు చెప్పిన రహీమ్
బంగ్లాదేశ్ మాజీ కెప్టెన్ ముష్ఫికర్ రహీమ్ ఓ వివాదంపై స్పందించాడు. ఓ టీ20 మ్యాచ్ లో సహచర ఆటగాడి పట్ల తాను ప్రవర్తించిన తీరుకు క్షమాపణలు చెబుతున్నానని పేర్కొన్నాడు. మ్యాచ్ జరుగుతుండగా, ఓ క్యాచ్ పట్టడానికి వికెట్ కీపింగ్ చేస్తున్న ముష్ఫికర్ రహీమ్ ప్రయత్నించాడు. అదే క్యాచ్ అందుకోవడానికి ఫీల్డర్ నసూమ్ అహ్మద్ కూడా వచ్చాడు. దాంతో ఇద్దరూ ఢీ కొట్టుకునేంత ప్రమాదం ఏర్పడింది. దాంతో నసూమ్ పై కోపోద్రిక్తుడయ్యాడు. 'కొడతా నిన్ను..' అనే స్థాయిలో హావభావాలు ప్రదర్శించాడు. అయితే నసూమ్ మాత్రం ఎంతో సంయమనం పాటించి గొడవ పెద్దది కాకుండా చూశాడు.
ఈ ఘటన తాలూకు వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో ముష్ఫికర్ పై నెటిజన్లు విమర్శనాస్త్రాలు సంధించారు. ఈ నేపథ్యంలో తన చర్యకు ముష్ఫికర్ పశ్చాత్తాపం ప్రకటించాడు. "నా ఫ్యాన్స్ కు, ప్రేక్షకులకు అందరికీ క్షమాపణలు తెలుపుకుంటున్నా. ఇప్పటికే నా జట్టు సహచరుడు నసూమ్ కు సారీ చెప్పాను. నేను కూడా మానవమాత్రుడ్నే. నేను చేసిన పని ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదు. అయితే మరోసారి ఇలాంటి తప్పు జరగదని స్పష్టం చేస్తున్నా" అని వివరణ ఇచ్చాడు.
ఈ ఘటనను తీవ్రంగా పరిగణించిన బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు ముష్ఫికర్ రహీమ్ మ్యాచ్ ఫీజు నుంచి పావుభాగం జరిమానాగా విధించింది.