Kamal Haasan: ఎంజీఆర్ ఏ పార్టీకి సొంతం కాదు.. తమిళ రాజకీయాలను వేడెక్కించిన కమలహాసన్ వ్యాఖ్యలు!
- మొత్తం తమిళనాడుకు ఎంజీఆర్ సొంతం
- నేను ఎంజీఆర్ అడుగుజాడల్లో పెరిగాను
- ఇప్పుడున్న మంత్రుల్లో చాలా మంది ఎంజీఆర్ ను చూడలేదు
మక్కల్ నీది మయ్యం పార్టీ అధినేత, సినీ నటుడు కమలహాసన్ తమిళనాడు రాజకీయాల్లో వేడి పుట్టించారు. తమిళనాట ఇప్పటికీ దివంగత ఎంజీఆర్ కు చెక్కుచెదరని అభిమానం ఉంది. అయితే, రాజకీయంగా ఆయన కేవలం అన్నాడీఎంకేకే పరిమితం. ఎందుకంటే ఆ పార్టీని స్థాపించింది ఆయనే. ఈ నేపథ్యంలో కమలహాసన్ కీలక వ్యాఖ్యలు చేశారు.
ఎంజీఆర్ అంటే ఏ ఒక్క పార్టీకో, ఏ ఒక్కరికో సొంతం కాదని కమల్ అన్నారు. తొలినాళ్లలో ఆయన ఉన్న డీఎంకేకి కానీ, ఆ తర్వాత ఆయన స్థాపించిన ఏఐఏడీఎంకేకి కానీ ఎంజీఆర్ సొంతం కాదని చెప్పారు. ఎంజీఆర్ అంటే మక్కల్ తిలగం (ప్రజల నాయకుడు) అని కీర్తించారు. మొత్తం తమిళనాడుకు ఆయన సొంతమని చెప్పారు. శివకాశిలో జరిగిన పార్టీ కార్యక్రమంలో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
ఎంజీఆర్ మా సొంతం అని రాష్ట్రంలోని ప్రతి ఒక్కరూ చెపుతారని... అలాంటప్పుడు అధికారంలో ఉన్న ఏఐఏడీఎంకే పార్టీ ఎంజీఆర్ తమకే సొంతమని ఎలా చెప్పుకోగలదని కమల్ ప్రశ్నించారు. ప్రజా నాయకుడిపై ఒక పార్టీ ముద్ర ఎలా వేయగలమని నిలదీశారు. తాను ఎంజీఆర్ అడుగుజాడల్లోనే పెరిగానని చెప్పారు. తమిళనాడులోని ఎంతో మంది మంత్రులు ఆయనను కనీసం చూడలేదని అన్నారు. 1980ల నాటి ఓ వీడియో క్లిప్ ను కమల్ చూపించారు. అందులో తనకు ఎంజీఆర్ శాలువా కప్పి, అవార్డు ఇచ్చి, ముద్దు పెట్టుకున్న దృశ్యాలు ఉన్నాయి. ఈ వీడియోను కమల్ తన ట్విట్టర్ ఖాతాలో కూడా పోస్ట్ చేశారు.