: వచ్చే ఏడాది చూసుకుంటాం: సన్ రైజర్స్ సారథి
కొత్త ఫ్రాంచైజీ అయినా, ఐపీఎల్-6లో ప్లే ఆఫ్ వరకు ప్రస్థానం సాగించామని, వచ్చే ఏడాది మరింత మెరుగైన జట్టుతో దూసుకొస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నాడు సన్ రైజర్స్ హైదరాబాద్ సారథి కామెరాన్ వైట్. బుధవారం ఢిల్లీలో జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్ లో సన్ రైజర్స్.. 4 వికెట్ల తేడాతో రాజస్థాన్ రాయల్స్ చేతిలో ఓటమిపాలైంది. రాయల్స్ బ్యాట్స్ మన్ బ్రాడ్ హాడ్జ్ (29 బంతుల్లో 54 నాటౌట్; 5 సిక్సులు, 2 ఫోర్లు) అద్బుతమైన ఆటతీరుతో మ్యాచ్ ను హైదరాబాద్ జట్టుకు దూరం చేశాడు.
ఈ పోరు అనంతరం సన్ రైజర్స్ సారథి వైట్ మీడియాతో మాట్లాడుతూ, పిచ్ బ్యాటింగ్ కు అనువుగా లేదన్నాడు. తాము మరికొన్ని పరుగులు అదనంగా సాధించి ఉంటే ఫలితం మరోలా ఉండేదని అభిప్రాయపడ్డాడు. ఇక వచ్చే సీజన్ నాటికి ఎవరు జట్టులో ఉంటారో తెలియదంటూ, ఫ్రాంచైజీ యాజమాన్యం నిర్ణయం మేరకు ఎంపికైన ఆటగాళ్ళతో జట్టు మరింత బలోపేతం అవుతుందని వైట్ ఆశాభావం వ్యక్తం చేశాడు.