KCR: ఫార్మాసిటీ శంకుస్థాపనకు మోదీని ఆహ్వానించిన కేసీఆర్
- హైదరాబాద్ శివారులో 19 వేల ఎకరాల్లో ఫార్మాసిటీ
- లక్షలాది మందికి ఉపాధి
- ఫార్మాసిటీలో కేంద్రం భాగస్వామ్యం అవసరమన్న కేసీఆర్
- పీవీకి భారతరత్న ప్రకటించాలని అభ్యర్థన
ఢిల్లీ పర్యటనలో ప్రధానమంత్రి నరేంద్రమోదీని కలిసిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్.. హైదరాబాద్ శివారులో నిర్మించనున్న ఫార్మాసిటీ శంకుస్థాపనకు రావాలని ఆహ్వానించారు. మొత్తం 19 వేల ఎకరాల్లో రూ. 64 వేల కోట్ల పెట్టుబడులతో , లక్షలాదిమందికి ఉపాధి కల్పించడమే లక్ష్యంగా దీనిని నిర్మిస్తున్నట్టు కేసీఆర్ ఈ సందర్భంగా ప్రధానికి తెలిపారు. దేశానికే తలమానికంగా నిలవనున్న ఈ ఔషధ నగరిలో కేంద్ర ప్రభుత్వ భాగస్వామ్యం కూడా అవసరమని కేసీఆర్ పేర్కొన్నారు.ఈ సందర్భంగా ప్రాజెక్టు నివేదికను ప్రధానికి అందించిన కేసీఆర్ ప్రాజెక్టు నిర్మాణానికి సహకరించాల్సిందిగా కోరారు.
ప్రపంచానికి అవసరమైన టీకాల్లో మూడోవంతు హైదరాబాద్‌లోనే తయారవుతున్నాయని, ఇప్పుడు కరోనా వ్యాక్సిన్లు కూడా ఇక్కడే తయారవుతుండడం దేశానికే గర్వకారణమన్నారు. మొత్తం 19 వేల ఎకరాల్లో ఫార్మాసిటీని నిర్మించనుండగా, 11 వేల ఎకరాలు ఇప్పటికే అందుబాటులో ఉందని, మిగతా భూమిని సేకరిస్తున్నట్టు చెప్పారు. అలాగే, ఇప్పటికే వెయ్యికిపైగా పరిశ్రమలు భూముల కోసం అభ్యర్థనలు పంపినట్టు ముఖ్యమంత్రి వివరించారు. అలాగే, దేశానికి ఎంతో సేవ చేసిన, ఆర్థిక సంస్కరణలకు ఆద్యుడైన పీవీ నరసింహారావుకు భారతరత్న పురస్కారం ప్రకటించాలని ఈ సందర్భంగా మోదీని కోరారు.
.