Apple: మరో ఆరు నెలలు వర్క్ ఫ్రమ్ హోమే: యాపిల్ చీఫ్ టిమ్ కుక్
- జూన్ 2021 వరకూ ఉద్యోగులు ఆఫీసులకు వచ్చే అవకాశాలు లేవు
- లాక్ డౌన్ ఎన్నో పాఠాలను నేర్పింది
- రిమోట్ విధానంలో పని చేయడం తెలిసిందన్న టిమ్ కుక్
తమ ఉద్యోగులు జూన్ 2021 వరకూ ఆఫీసులకు వచ్చే అవకాశాలు లేవని యాపిల్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ టిమ్ కుక్ వ్యాఖ్యానించారు. తాజాగా, ఉద్యోగులతో వర్చ్యువల్ విధానంలో సంభాషించిన ఆయన, తన మనసులో పలు విషయాలను పంచుతున్నారు. ఈ లాక్ డౌన్ సమయంలో సంస్థ ఎన్నో విజయాలను సాధించిందని, భవిష్యత్తులో రిమోట్ విధానంలో పని చేయడాన్ని సులభం చేసిందని అన్నారు. మరో ఆరు నెలలు ఇదే పరిస్థితి ఉండనుందని అంచనా వేశారు.
ఉద్యోగులు కార్యాలయాలకు వచ్చి పనిచేస్తేనే బాగుంటుందని వ్యాఖ్యానించిన టిమ్ కుక్, ముఖాముఖి కూర్చుని చర్చలు జరపడానికి మరో ప్రత్యామ్నాయం లేదని, అయితే, ఈ కరోనా కారణంగా అది సాధ్యం కాకుండా పోయిందని అన్నారు.ఇదే సమయంలో ఆఫీసుకు రాకుండా కూడా తమ పనిని ఎలా విజయవంతంగా చేయవచ్చన్న విషయాన్ని నేర్చుకున్నారని అన్నారు. ఈ లాక్ డౌన్ సమయంలో నేర్చుకున్న పాఠాలు భవిష్యత్ లో ఎంతో ఉపకరిస్తాయని అన్నారు.