Chandrababu: వైసీపీ అవినీతి బయటపెట్టినందుకే గురుప్రతాప్ రెడ్డిని హత్య చేశారు: చంద్రబాబు
- డీజీపీకి లేఖ రాసిన చంద్రబాబు
- నిందితులను శిక్షించాలంటూ డిమాండ్
- ప్రశ్నిస్తే వేధింపులకు పాల్పడుతున్నారని వెల్లడి
- అవినీతి సమాచారం వెల్లడిస్తే చంపేయడం దారుణమని వ్యాఖ్యలు
- చిత్తూరు జిల్లా కార్యకర్తలకు ఫోన్ ద్వారా పరామర్శ
టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు రాష్ట్ర డీజీపీ గౌతమ్ సవాంగ్ కు మరోసారి లేఖ రాశారు. వైసీపీ అవినీతిని బయటపెట్టినందుకే సీఆర్పీఎఫ్ రిటైర్డ్ కానిస్టేబుల్ గురుప్రతాప్ రెడ్డిని హత్య చేశారని లేఖలో ఆరోపించారు. గండికోట పరిహారం చెల్లింపుల్లో అక్రమాలను గురుప్రతాప్ రెడ్డి బట్టబయలు చేశాడని, గురుప్రతాప్ రెడ్డి కేసులో నిందితులను శిక్షించాలని డిమాండ్ చేశారు. అధికార పార్టీ అవినీతిని ప్రశ్నించినవారిపై వేధింపులకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అవినీతి సమాచారం వెల్లడించినవారిని హత్య చేయడం చాలా దారుణమని పేర్కొన్నారు.
కాగా, చిత్తూరు జిల్లాలో జరిగిన దాడుల్లో గాయపడిన టీడీపీ కార్యకర్తలను చంద్రబాబు ఫోన్లో పరామర్శించారు. వైసీపీ దాడులకు భయపడేది లేదని స్పష్టం చేశారు. దాడిచేసిన వారిని వదిలేసి గాయపడిన వారిని అరెస్ట్ చేశారని ఆరోపించారు. వైసీపీ దౌర్జన్యాలకు ప్రజలే బుద్ధి చెబుతారని వ్యాఖ్యానించారు.