Corona Virus: ఫైజర్, బయో ఎన్ టెక్ సంస్థల కరోనా వ్యాక్సిన్ డేటా తస్కరించిన హ్యాకర్లు
- వ్యాక్సిన్ రేసులో ముందంజలో ఉన్న ఫైజర్, బయో ఎన్ టెక్
- యూరోపియన్ మెడిసిన్ ఏజెన్సీ నుంచి డేటా చోరీ
- మరికొన్నిరోజుల్లో విడుదల కానున్న వ్యాక్సిన్
- వ్యాక్సిన్ సమీక్షపై ప్రభావం ఉండబోదన్న ఏజెన్సీ
కరోనా వ్యాక్సిన్ కోసం అహర్నిశలు శ్రమించి సత్ఫలితాలు సాధించిన ఫార్మా సంస్థల్లో అమెరికాకు చెందిన ఫైజర్, జర్మనీకి చెందిన బయో ఎన్ టెక్ కూడా ఉన్నాయి. పలు దేశాల్లో వ్యాక్సిన్ విడుదలకు అనుమతుల కోసం ఎదురుచూస్తున్న తరుణంలో ఊహించని పరిణామం ఏర్పడింది. ఈ సంస్థలు అభివృద్ధి చేసిన వ్యాక్సిన్ డేటా ఇప్పుడు హ్యాకర్ల పరమైందన్న సమాచారం ఆందోళన కలిగిస్తోంది.
యూరోపియన్ మెడిసిన్స్ ఏజెన్సీపై హ్యాకర్లు దాడి చేసి తమ వ్యాక్సిన్ సమాచారం దొంగిలించారని ఫైజర్, బయో ఎన్ టెక్ వెల్లడించాయి. యూరోపియన్ మెడిసిన్ ఏజెన్సీ ఈ విషయం వెల్లడించిందని రెండు సంస్థలు తెలిపాయి.
అయితే ఈ దాడితో వ్యాక్సిన్ విడుదలకు సంబంధించిన అంశాల సమీక్షపై ఏమాత్రం ప్రభావం పడదని ఏజెన్సీ తమకు హామీ ఇచ్చినట్టు ఫైజర్, బయో ఎన్ టెక్ పేర్కొన్నాయి. కీలక డేటా హ్యాకర్ల వశమైన సంఘటనకు ఎవరు బాధ్యత వహిస్తారన్న దానిపై ఆ రెండు సంస్థలు స్పందించలేదు.