Corona Virus: కరోనా చికిత్స కోసం శక్తిమంతమైన ఔషధాలను గుర్తించిన శాస్త్రవేత్తలు
- ఇప్పటికీ విజృంభిస్తున్న కరోనా మహమ్మారి
- వ్యాక్సిన్ కోసం ఎదురుచూపులు
- సింగిల్, కాంబినేషన్ మందులను గుర్తించిన సైంటిస్టులు
- కరోనా వైరస్ ను కట్టడి చేస్తాయని వెల్లడి
- ఉత్పరివర్తనాలకు గురైన వైరస్ ను కూడా తుదముట్టిస్తాయన్న వివరణ
గత ఏడాది కాలంగా యావత్ ప్రపంచాన్ని కలవరపెడుతున్న కరోనా వైరస్ ను ఎదుర్కొనే వ్యాక్సిన్ కోసం అందరూ ఎదురుచూస్తున్నారు. అయితే కరోనా సోకినా, దాన్ని సమర్థవంతమైన ఔషధాలతో తుదముట్టించవచ్చని శాస్త్రవేత్తలు అంటున్నారు. కరోనాను తరిమికొట్టే శక్తిమంతమైన ఔషధాలను తమిళనాడుకు చెందిన అళగప్ప యూనివర్సిటీ, స్వీడన్ కు చెందిన కేటీహెచ్ రాయల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ శాస్త్రవేత్తలు గుర్తించారు.
టివాంటినిబ్, ఒలాపారిబ్, జోలిఫ్లోడాసిన్, గోల్వాటినిబ్, సోనిడెజిబ్, రిగోరాఫెనిబ్, పీసీఓ-371 వంటి సింగిల్ మెడిసిన్ తో పాటు బలోక్సావిర్ మార్బోక్సిల్, నాటామైసిన్, ఆర్యూ85053 వంటి కాంబినేషన్ ఔషధాలు కరోనా కణంలోని మూడు కీలక ప్రొటీన్లపై దాడి చేస్తాయని అళగప్ప వర్సిటీకి చెందిన వైభవ్ శ్రీవాస్తవ, అరుళ్ మురుగన్ అనే పరిశోధకులు వెల్లడించారు.
ఈ మందులు హెచ్ఐవీ వంటి ప్రమాదకరమైన వైరస్ ను కూడా అత్యంత సమర్థంగా ఎదుర్కొంటాయని ఇప్పటికే నిరూపితమైందని తెలిపారు. కరోనా వైరస్ అనేక రకాలుగా జన్యు ఉత్పరివర్తనాలకు లోనైనప్పటికీ, తాము గుర్తించిన ఔషధాలు ప్రభావవంతంగా పనిచేస్తాయని వివరించారు. ఇవేకాకుండా, డీబీ04016, థాలోసియానైన్, తడాల్పిల్ ఔషధాలు కూడా కరోనాను కట్టడి చేయగలవని వెల్లడించారు.