India: కొత్త పార్లమెంటు భవనం ప్రత్యేకతలు ఇవే!

Speacialities of new Parliament Central Vista
  • 64,500 చదరపు మీటర్ల వైశాల్యంలో కొత్త పార్లమెంటు
  • లోక్ సభలో 888 మంది సభ్యులు కూర్చునేలా నిర్మాణం
  • 2022 నాటికి అందుబాటులోకి రానున్న పార్లమెంటు
స్వతంత్ర భారతదేశ చరిత్రలో ఈరోజు అత్యంత ప్రాధాన్యమైన రోజుగా చరిత్ర పుటల్లోకి ఎక్కింది. కొత్త పార్లమెంటు భవనానికి ప్రధాని మోదీ భూమి పూజను కాసేపట్లో నిర్వహించనున్నారు. ఇప్పుడు ఉన్న పార్లమెంటు భవనం పక్కనే దీన్ని నిర్మిస్తున్నారు. కొత్త పార్లమెంటుకు సంబంధించిన ప్రత్యేకతలు, విశేషాలు ఇవే.

ఈ రోజు మధ్యాహ్నం 12.55 నిమిషాలకు ప్రధాని మోదీ భూమిపూజను నిర్వహించనున్నారు. ఒంటి గంటకు ఫౌండేషన్ స్టోన్ వేస్తారు. కొత్త పార్లమెంటుకు 'సెంట్రల్ విస్టా' అని నామకరణం చేశారు.

రూ. 971 కోట్ల బడ్జెట్ తో పార్లమెంటు భవనాన్ని నిర్మిస్తున్నారు. ఈ బిల్డింగ్ 64,500 చదరపు మీటర్ల వైశాల్యాన్ని కలిగి ఉంటుంది. 2022 ఆగస్టులో మన దేశం 75వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను నిర్వహించుకునే సమయానికి కొత్త పార్లమెంటు అందుబాటులోకి వస్తుంది. ఆ వేడుకలు సెంట్రల్ విస్టాలోనే జరుగుతాయి.

కొత్త పార్లమెంటులోని లోక్ సభలో 888 మంది సభ్యులు కూర్చునేలా నిర్మిస్తున్నారు. రానున్న రోజుల్లో ఈ కెపాసిటీని 1,224 సభ్యులకు పెంచుకునేలా ప్లానింగ్ చేశారు. రాజ్యసభలో 384 మంది సభ్యులు కూర్చునేలా నిర్మిస్తున్నారు. భవిష్యత్తులో సభ్యుల సంఖ్య పెరిగినా వారికి కూడా సరిపోయేలా హాల్ ను నిర్మించనున్నారు. ప్రస్తుతం లోక్ సభలో 543 మంది, రాజ్యసభలో 245 మంది సభ్యులు ఉన్నారు.

ప్రతి పార్లమెంటు సభ్యుడికి 40 చదరపు మీటర్ల ఆఫీస్ స్పేస్ ను శ్రమ శక్తి భవన్ లో ఏర్పాటు చేయనున్నారు. ఈ భవనం 2024 నాటికి పూర్తవుతుంది. కొత్త పార్లమెంటు భవనం మన చారిత్రక వారసత్వాన్ని ప్రతిబింబించేలా ఉంటుంది. ప్రతి అడుగులో భారతీయత ఉట్టిపడేలా నిర్మాణం జరగనుంది. 

పాత పార్లమెంటు భవనాన్ని బ్రిటీష్ హయాంలో నిర్మించారు. అయితే అత్యాధునిక టెక్నాలజీకి అనుగుణంగా కొత్త పార్లమెంటు ఉండాలని ఎక్కువ మంది పార్లమెంటు సభ్యులు అభిప్రాయపడ్డారు. మారిన ప్రపంచానికి తగ్గట్టుగా కొత్త భవనం ఉండాలని చెప్పారు.

మరోవైపు పాత భవనం కొంత ఇరుకుగా కూడా ఉందని భావిస్తున్నారు. ప్రస్తుత పార్లమెంటు భవనాన్ని అప్ గ్రేడ్ చేసే అవకాశం కూడా లేకపోవడంతో, కొత్త భవనాన్ని నిర్మించాలనే నిర్ణయానికి వచ్చారు. 93 సంవత్సరాల ప్రస్తుత పార్లమెంటు భవనానికి ఎలాంటి నష్టం వాటిల్లకుండా, భూకంపాలను కూడా తట్టుకునేలా కొత్త భవనాన్ని నిర్మించనున్నారు. ప్రస్తుత పార్లమెంటు భవనాన్ని పురావస్తుశాఖకు అప్పగిస్తున్నట్టు లోక్ సభ స్పీకర్ ఓంబిర్లా తెలిపారు.
India
New Parliament
Central Vista

More Telugu News