Chapati Maker: రైతుల నిరసనల్లో అందరి దృష్టిని ఆకర్షిస్తున్న రొట్టెల యంత్రం!
- ఢిల్లీలో రైతుల నిరసనలు
- నిరసనల్లో పాల్గొంటున్న వేలమంది రైతులు
- రైతుల ఆకలి తీర్చేందుకు రొట్టెల యంత్రం వినియోగం
- గంటకు 2 వేల చపాతీలు తయారుచేస్తున్న యంత్రం
- యంత్రంలో పిండి ముద్దలు ఉంచితే చాలు చపాతీలు తయార్
వ్యవసాయ చట్టాలు రద్దు చేయాలంటూ ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు నిరసనలు తెలియజేస్తున్నారు. వంటావార్పు కూడా రోడ్డుపైనే చేసుకుంటూ, రోడ్లమీదనే భోజనాలు చేస్తూ రైతులు కేంద్రానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నారు. అయితే, ఈ నిరసనల్లో పాల్గొంటున్న రైతులు తమ ప్రధాన ఆహారమైన రొట్టెల కోసం ఓ యంత్రాన్ని ఉపయోగిస్తున్నారు. ఇప్పుడీ రోటీ మేకర్ అందరినీ ఆకర్షిస్తోంది.
ఇదేమీ అల్లాటప్పా రొట్టెల యంత్రం కాదు... దీని సాయంతో గంటకు 2000 రొట్టెలు తయారుచేయవచ్చు. సాధారణంగా ఇలాంటి యంత్రాలను పంజాబ్ లోని ప్రముఖ పుణ్యక్షేత్రం అమృత్ సర్ స్వర్ణదేవాలయంలోనూ, ఇతర పెద్ద గురుద్వారాల్లోనూ ఉపయోగిస్తుంటారు. నిరసనల్లో పాల్గొనేందుకు రైతులు భారీగా తరలిరావడంతో వారి ఆకలి తీర్చేందుకు ఈ యంత్రాన్ని కూడా తీసుకువచ్చారు. పిండి ముద్దలు దాంట్లో ఉంచితే చాలు, వేడి వేడిగా చపాతీలు బయటికి వస్తాయి. ప్రస్తుతం ఈ యంత్రం రోజుకి కొన్ని వేల మంది ఆకలి తీర్చుతోంది.