Nara Lokesh: ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే ఏలూరులో శ్రీధర్ అనే వ్యక్తి మృతి చెందాడు: నారా లోకేశ్

 Nara Lokesh says Sridhar dies of only Government negligence

  • ఏలూరులో విజృంభిస్తున్న వింత వ్యాధి
  • ఏపీలో మొదలైన రాజకీయ దుమారం
  • ప్రభుత్వంపై విమర్శల దాడికి దిగిన లోకేశ్
  • సమస్యను తేలిగ్గా తీసుకున్నారంటూ వ్యాఖ్యలు

పశ్చిమ గోదావరి జిల్లాలో మిస్టరీ వ్యాధితో వందల మంది ప్రజలు బాధపడుతుండడం రాజకీయ దుమారం రేపుతోంది. ఏలూరులో శ్రీధర్ అనే వ్యక్తి మృతి చెందినట్టు వార్తలు రావడం పట్ల టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఘాటుగా స్పందించారు. వైఎస్ జగన్ నిర్లక్ష్య ధోరణి వల్లే ప్రజల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయని వ్యాఖ్యానించారు.

ఐదు రోజుల నుంచి ప్రజలు అస్వస్థతకు గురవుతున్నా ప్రభుత్వం మొద్దు నిద్రపోయిందని, వందల సంఖ్యలో ప్రజలు, చిన్నారులు అస్వస్థతకు గురవుతున్నా తేలిగ్గా తీసుకున్నారని విమర్శించారు. అందుకే ఏలూరు విద్యానగర్ కు చెందిన శ్రీధర్ అనే వ్యక్తి మరణించాడని, ఇది ప్రభుత్వ హత్యేనని ఆరోపించారు. మెరుగైన వైద్య సహాయం అందించాలని తాము డిమాండ్ చేసినా స్పందించకపోవడం వల్లే శ్రీధర్ కన్నుమూశాడని లోకేశ్ ట్వీట్ చేశారు. ప్రజల ప్రాణాలు కాపాడుకునే అవకాశం ఉన్నా ఇలా జరగడం బాధాకరమని పేర్కొన్నారు.

ఇప్పటికైనా వింతరోగం, మాస్ హిస్టీరియా అంటూ డ్రామాలు వేయడం మానేసి ప్రభుత్వం వాస్తవాలు బయటపెట్టాలని డిమాండ్ చేశారు. బాధిత కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని స్పష్టం చేశారు.

  • Loading...

More Telugu News