Pawan Kalyan: 'సబ్ కా మాలిక్ ఏక్' అనే సిద్ధాంతాన్ని నమ్ముతా... అందుకే నమాజ్ వినిపిస్తే ప్రసంగం ఆపేస్తా: పవన్ కల్యాణ్
- నెల్లూరు జిల్లాలో పవన్ పర్యటన
- రోడ్డు పక్కన ప్రజలను చూసి కాన్వాయ్ నిలిపివేత
- యువకులు, స్థానికులతో ఆత్మీయ భేటీ
- తనకు కులాలు, మతాల పిచ్చిలేదని స్పష్టీకరణ
- ఏ ప్రార్థనా మందిరంపై దాడి జరిగినా ఒకేలా స్పందిస్తానని వెల్లడి
జనసేనాని పవన్ కల్యాణ్ దక్షిణ కోస్తా జిల్లాల్లో పర్యటిస్తూ తుపాను బాధితులను పరామర్శిస్తున్నారు. ఇవాళ ఆయన నెల్లూరు జిల్లాల్లోని పలు ప్రాంతాలను సందర్శించారు. వెంకటగిరి వెళుతూ ఓ చోట కాన్వాయ్ ఆపి స్థానికులతో ఆత్మీయంగా ముచ్చటించారు. ఈ సందర్భంగా తన మనోభావాలను వారితో పంచుకున్నారు.
తనకు కులాలు, మతాల పిచ్చి లేదని, దేవాలయాలపై దాడి జరిగితే ఎలా స్పందిస్తానో, మసీదులు, చర్చిలపై దాడి జరిగినా అలాగే స్పందిస్తానని చెప్పారు. భగవంతుడు ఒక్కడే అన్నది తన అభిప్రాయమని, 'సబ్ కా మాలిక్ ఏక్' అనే సిద్ధాంతాన్ని నమ్ముతానని, అందుకే తన సభలు, సమావేశాల మధ్యలో నమాజ్ వినిపిస్తే వెంటనే ప్రసంగం ఆపేస్తానని తెలిపారు. దేశంలో అన్ని మతాలకు సమానమైన విలువ ఉందని, భిన్నత్వంలో ఏకత్వం మన దేశం గొప్పదనం అని కీర్తించారు.
పార్టీలు యువతను వాడుకుని వదిలేస్తున్నాయని, జనసేన మాత్రమే యువతకు బంగారు భవిష్యత్తు అందించాలని కోరుకుంటోందని స్పష్టం చేశారు. యువత వారి కాళ్లపై వాళ్లు నిలబడి దేశం కోసం ఏమైనా చేయగలిగితే జనసేన పార్టీ పెట్టినందుకు సార్థకత వచ్చినట్టే పవన్ వ్యాఖ్యానించారు.
అంతకుముందు ఆయన మాట్లాడుతూ, చిన్నప్పుడు పుస్తకాల్లో చెప్పిన దానికి, నిజజీవిత పరిస్థితులకు ఎంతో తేడా ఉంటుందని అన్నారు. ఎటు చూసినా అవినీతిమయంగా ఉన్న సమాజంలో మార్పు తీసుకువచ్చేందుకే జనసేన పార్టీ స్థాపించానని తెలిపారు. యువతలో దేశభక్తి కలిగించాలన్న ఉద్దేశంతోనే తన సినిమాల్లో దేశభక్తికి సంబంధించిన పాటలు ఉంటాయని అన్నారు.
యువత ప్రశ్నించడం అలవర్చుకోవాలని, మనం కష్టపడి పనిచేయగా వచ్చిన డబ్బుల్లో నుంచి పన్నులు కడితే ఆ సొమ్ము ఖజానాకు చేరుతుందని, ఆ డబ్బును తిరిగి మనకు ఖర్చు చేయడానికి ఏదో త్యాగం చేసినట్టుగా నాయకులు మాట్లాడుతున్నారని పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు. దాడులు చేస్తామని కొందరు బెదిరిస్తున్నా ప్రజాస్వామ్యంపై గౌరవభావంతో సంయమనం పాటిస్తున్నాయని పేర్కొన్నారు. ఎన్నికల్లో ఓటమిపాలైనా తనకేమీ ఓడిపోయిన భావన కలగడంలేదని, మార్పు వచ్చేంతవరకు తన ప్రయాణం కొనసాగుతుందని ఉద్ఘాటించారు.