Harvard Medical School: పోయిన చూపు తిరిగొచ్చేలా... హార్వర్డ్ శాస్త్రవేత్తల అద్భుత పరిశోధన!
- కంటిచూపు కోల్పోయిన ఎలుకలపై ప్రయోగం
- బాహ్యజన్యువుల రీప్రోగ్రామింగ్ చేసిన పరిశోధకులు
- నూతనోత్తేజం పొందిన ఎలుకల కళ్లు
వయసు పెరిగే కొద్దీ కంటి చూపు మందగించడం సాధారణమైన విషయం. కొందరిలో పూర్తిగా దృష్టి లోపం ఏర్పడితే, మరికొందరిలో పాక్షికంగా లోపం కనిపిస్తుంది. అయితే, హార్వర్డ్ మెడికల్ స్కూలుకు చెందిన శాస్త్రవేత్తల పరిశోధన ఫలితాలు కొత్త ఆశలు రేకెత్తిస్తున్నాయి. పోయిన చూపు తిరిగొస్తుందన్న నమ్మకం కలిగిస్తున్నాయి.
హార్వర్డ్ పరిశోధకులు చూపు కోల్పోయిన ఎలుకలపై ప్రయోగాలు చేసి వాటిలో కంటిచూపును పునరుద్ధరించగలిగారు. ఎంతో సంక్లిష్టమైన బాహ్యజన్యువులను రీప్రోగ్రామింగ్ చేయడం ద్వారా వారు ఈ ఘనత సాధించారు. ఎలుకల కళ్లలోని రెటీనాలో ఉండే వృద్ధ కణాలను రీప్రోగ్రామింగ్ చేశారు. మూడు యవ్వన కారక జన్యువులను ఎలుకల రెటీనాలో ప్రవేశపెట్టారు. ఓసీటీ4, ఎస్ఓఎక్స్2, కేఎల్ఎఫ్4 అనే ఈ జన్యువుల ద్వారా ఆ ఎలుకల్లో కంటి చూపు మళ్లీ పుంజుకుంది.
బాహ్యజన్యువుల రీప్రోగ్రామింగ్ ద్వారా కంటిచూపు మాత్రమే కాకుండా ఇతర అవయవాల కణజాలాలను కూడా పునరుత్తేజితం చేయొచ్చని హార్వర్డ్ శాస్త్రవేత్తల పరిశోధనతో వెల్లడైంది. అదే జరిగితే వృద్ధుల్లో వార్ధక్యంతో వచ్చే జబ్బులను కూడా నివారించవచ్చని భావిస్తున్నారు.