Farmers: 'మా వద్దకు రండి... జిలేబీ, పకోడీ, చాయ్ మేమే ఇస్తాం'... కేంద్ర మంత్రికి రైతు నేతల ఆహ్వానం
- నిన్న రైతు సంఘాల నేతలతో కేంద్ర మంత్రుల చర్చలు
- రైతులకు టీ ఆఫర్ చేసిన తోమర్
- తాము ఇంకా చాలా ఇస్తామన్న కుల్వంత్ సింగ్
వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ కు నిరసనలు తెలుపుతున్న రైతు సంఘాల నాయకుల నుంచి, తమ ప్రాంతానికి రావాలన్న ఆహ్వానం అందింది. తాము ఏర్పాటు చేసుకున్న సామూహిక వంటశాల వద్దకు వస్తే, జిలేబీ, పకోడీ, టీ ఇస్తామని వారు ఆహ్వానించారు. నిన్న రైతు నేతలతో సుదీర్ఘ సమావేశం జరిగిన వేళ, తోమర్ వారికి టీ పంపించారు. ఆపై రైతు నేత జమ్హురి కిసాన్ సభ చీఫ్ కుల్వంత్ సింగ్ సాధు, తమ వద్దకు వస్తే టీతో పాటు మరిన్ని అందిస్తామని అనడంతో అక్కడ నవ్వులు విరిశాయి.
"తోమర్ సాబ్ మమ్మల్ని టీ తీసుకోవాలని కోరారు. అందుకు ప్రతిగా, మేము నిరసనలు తెలుపుతున్న ప్రాంతానికి వస్తే, జిలేబీ, పకోడీలను కూడా కలిపి ఇస్తామని చెప్పాం. దీంతో అందరూ నవ్వారు" అని ఆయన సమావేశం తరువాత పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. తమ చర్చల్లో ప్రభుత్వం ఓ కమిటీని ఏర్పాటు చేసే అంశం కూడా తెరపైకి వచ్చిందని అన్నారు.
ఈ సమావేశంలో రైతుల తరఫున 35 మంది పాల్గొన్నామని, ప్రభుత్వం తమ డిమాండ్లను పరిష్కరించే ఉద్దేశంతో లేదని తెలుసుకున్నామని వ్యాఖ్యానించిన ఆయన, అందువల్లే రైతులు లేవనెత్తిన అంశాల పరిష్కారానికి కమిటీని వేస్తామన్న ప్రతిపాదనను తాము తిరస్కరించామని స్పష్టం చేశారు. కాగా, కేంద్రం, రైతు సంఘాల మధ్య రేపు మరో విడత చర్చలు జరుగనున్నాయి.