Adar Poonawala: చెన్నై వలంటీర్ నరాల సమస్యలకు మా వ్యాక్సిన్ కారణం కాదు: అదార్ పూనావాలా
- ఆక్స్ ఫర్డ్ వ్యాక్సిన్ కు భారత్ లో క్లినికల్ ట్రయల్స్
- తనలో నరాల జబ్బు వచ్చిందన్న చెన్నై వలంటీర్
- తప్పుడు ఆరోపణలు అంటూ స్పష్టం చేసిన పూనావాలా
ఆక్స్ ఫర్డ్-ఆస్ట్రాజెనెకా తయారుచేసిన కొవిషీల్డ్ వ్యాక్సిన్ కు వలంటీర్ గా వ్యవహరించిన ఓ చెన్నై వ్యక్తి వ్యాక్సిన్ కారణంగా తనలో నాడీ వ్యవస్థ బాగా దెబ్బతిన్నదంటూ రూ.5 కోట్లకు సీరమ్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (ఎస్ఐఐ)కు లీగల్ నోటీసులు పంపడం తెలిసిందే. అయితే ఆ వలంటీర్ మోసపూరిత ఆరోపణలు చేస్తున్నాడని, అతనిపై రూ.100 కోట్లకు పరువునష్టం దావా వేస్తామని ఎస్ఐఐ వెల్లడించింది. ఈ మొత్తం వ్యవహారంపై సీరమ్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఇండియా అధిపతి అదార్ పూనావాలా స్పందించారు.
తమ కొవిషీల్డ్ వ్యాక్సిన్ అత్యంత భద్రమైనదని స్పష్టం చేశారు. చెన్నై వలంటీరు వ్యాఖ్యల్లో నిజంలేదని ఆరోపించారు. చెన్నై వలంటీరులో కలిగిన నరాల సమస్యలకు తమ వ్యాక్సిన్ కారణం కాదని వెల్లడించారు. అతని వ్యాఖ్యల వెనుక తప్పుడు ఉద్దేశాలు ఉన్నట్టు భావిస్తున్నామని తెలిపారు. ఆక్స్ ఫర్డ్-ఆస్ట్రాజెనెకా అభివృద్ధి చేసిన కొవిషీల్డ్ వ్యాక్సిన్ కు భారత్ లో క్లినికల్ ట్రయల్స్ నిర్వహిస్తున్నది ఎస్ఐఐనే. అంతేకాదు, కొవిషీల్డ్ ను పెద్ద ఎత్తున ఉత్పిత్తి చేసేందుకు కూడా ఎస్ఐఐ హక్కులు పొందింది.