Local Body Polls: స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ అంశంపై హైకోర్టులో పిటిషన్ వేసిన ఏపీ ప్రభుత్వం
- ఫిబ్రవరిలో ఎన్నికలు నిర్వహిస్తామన్న ఎస్ఈసీ
- ప్రభుత్వాన్ని సంప్రదించకుండానే ప్రకటన చేశారన్న ప్రభుత్వం
- ప్రజల ఆరోగ్యమే తమకు ముఖ్యమని పిటిషన్ లో పేర్కొన్న వైనం
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించేందుకు ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ సిద్ధంగా ఉన్న సంగతి తెలిసిందే. ఫిబ్రవరిలో ఎన్నికలను నిర్వహిస్తామని ఆయన ప్రకటించారు. అయితే, కరోనా నేపథ్యంలో ఎన్నికలను ఇప్పట్లో నిర్వహించడం సాధ్యం కాదని రాష్ట్ర ప్రభుత్వం చెపుతోంది. ఇదే విషయాన్ని ఇప్పటికే ఏపీ హైకోర్టు దృష్టికి తీసుకొచ్చింది.
ఈ నేపథ్యంలో హైకోర్టులో రాష్ట్ర పంచాయతీరాజ్ ప్రిన్సిపల్ సెక్రటరీ గోపాలకృష్ణ ద్వివేది పిటిషన్ వేశారు. ఫిబ్రవరిలో ఎన్నికలను నిర్వహిస్తామంటూ ప్రభుత్వాన్ని సంప్రదించకుండానే ఎస్ఈసీ ప్రకటన చేశారని పిటిషన్ లో పేర్కొన్నారు. ప్రతివాదిగా ఎన్నికల కమిషన్ కార్యదర్శిని చేర్చారు. ఎస్ఈసీ ప్రకటన సుప్రీంకోర్టు ఆదేశాలకు కూడా విరుద్ధంగా ఉందని చెప్పారు.
రాష్ట్రంలో కరోనా తీవ్రత ఉందని, ప్రజల ఆరోగ్యం ప్రభుత్వానికి అత్యంత ముఖ్యమని పిటిషన్ లో పేర్కొన్నారు. కరోనా మహమ్మారి వల్ల రాష్ట్రంలో 6 వేల మంది మరణించారని చెప్పారు. గతంలో కరోనా ఉందనే కారణంతో ఎన్నికలను వాయిదా వేశారని, ఇప్పుడు ఎన్నికలను నిర్వహిస్తామని చెపుతుండటం సరికాదని తెలిపారు. ఎన్నికల ప్రక్రియను నిలిపివేస్తూ ఆదేశాలను జారీ చేయాలని హైకోర్టును కోరింది.