JC Diwakar Reddy: జేసీ దివాకర్ రెడ్డిపై ఏపీ గనుల శాఖ రూ. 100 కోట్ల జరిమానా!
- నిబంధనలకు విరుద్ధంగా తవ్వకాలు
- త్రిశూల్ సిమెంట్ ఫ్యాక్టరీ పేరిట అక్రమాలు
- జరిమానా చెల్లించకుంటే ఆస్తుల జప్తు
తెలుగుదేశం పార్టీ నేత జేసీ దివాకర్ రెడ్డికి చెందిన త్రిశూల్ సిమెంట్ ఫ్యాక్టరీలో భారీ ఎత్తున అక్రమాలు జరిగాయని నిర్ధారించిన ఆంధ్రప్రదేశ్ గనుల శాఖ రూ.100 కోట్ల జరిమానా విధించాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. ఈ జరిమానా కట్టకుంటే, ఆర్ అండ్ ఆర్ చట్టం కింద ఆస్తుల జప్తునకు వెనుకాడబోమని అధికారులు హెచ్చరించినట్టు సమాచారం.
అనంతపురం జిల్లా కోన ఉప్పలపాడులో 14 లక్షల మెట్రిక్ టన్నుల లైమ్ స్టోన్ ను నిబంధనలకు విరుద్ధంగా తవ్వించారని గతంలోనే జేసీ ఫ్యామిలీపై ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. తన బినామీల ద్వారా అనుమతులు పొందిన జేసీ, అనుమతి లభించాక, వాటిని తన కుటుంబీకులకు బదలాయించి, అక్రమాలకు తెర లేపారని అధికారులు గుర్తించిన మీదటే భారీ జరిమానా విధించాలని నిర్ణయించినట్టు సమాచారం. ఈ మొత్తం వ్యవహారంపై మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది.