Narendra Modi: అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించనున్న మోదీ
- శుక్రవారం అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించనున్న మోదీ
- పార్టీ ఫ్లోర్ లీడర్లకు సమాచారం పంపిన పార్లమెంటరీ శాఖ
- కరోనా వైరస్ పై చర్చించనున్న ప్రధాని
రానున్న శుక్రవారం ప్రధాని మోదీ అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించనున్నారు. మన దేశంలో కరోనా వైరస్ పరిస్థితిపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. కరోనా వైరస్ పంజా విసిరిన తర్వాత ఇది మోదీ నిర్వహిస్తున్న రెండో అఖిలపక్ష సమావేశం కావడం గమనార్హం. ఈ సమావేశానికి కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్ నాథ్ సింగ్, హర్షవర్ధన్, ప్రహ్లద్ జోషి తదితరులు హాజరుకానున్నట్టు సమాచారం. ఇప్పటికే అన్ని పార్టీల ఫ్లోర్ లీడర్లకు పార్లమెంటరీ శాఖ నుంచి సమాచారం వెళ్లింది.
కరోనా కేసులు అత్యధికంగా నమోదైన దేశాల జాబితాలో భారత్ రెండో స్థానంలో ఉంది. ప్రథమ స్థానంలో అమెరికా ఉంది. అయితే మిలియన్ జనాభాకు నమోదైన మరణాల సంఖ్యను పరిగణనలోకి తీసుకుంటే భారత్ లో నమోదైన మరణాల సంఖ్య తక్కువేనని ఈరోజు కేంద్ర వైద్యశాఖ తెలిపింది. మన దేశంలో ఇప్పటి వరకు దాదాపు 94 లక్షల కరోనా కేసులు నమోదయ్యాయి. వీరిలో 88 లక్షల మంది కరోనా నుంచి కోలుకున్నారు. దాదాపు 1.3 లక్షల మంది కరోనా వల్ల ప్రాణాలు కోల్పోయారు. త్వరలోనే కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి రానుందనే వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే వ్యాక్సిన్ ను తయారు చేస్తున్న కంపెనీలను మొన్న మోదీ సందర్శించారు.