Jagan: ఆ బిల్లును మండలి ముందుంచితే తిప్పి పంపారు... ఇక నో చెప్పడానికి వీల్లేదు: సీఎం జగన్
- మరోసారి అసెంబ్లీలో పంచాయతీరాజ్ చట్ట సవరణ బిల్లు
- లాంఛనంగా ఆమోదం తెలిపిన అసెంబ్లీ
- చర్చ లేకుండా ఆమోదం ఏంటన్న టీడీపీ
- ఇదేమీ కొత్త బిల్లు కాదన్న సీఎం జగన్
ఏపీ చట్టసభల శీతాకాల సమావేశాలు ఇవాళ ప్రారంభం అయ్యాయి. గతంలో తీవ్ర చర్చకు దారితీసిన పంచాయతీరాజ్ చట్ట సవరణ బిల్లుకు ఏపీ అసెంబ్లీ నేడు ఆమోదం తెలిపింది. అయితే, బిల్లుపై చర్చ జరగనిదే ఎలా ఆమోదిస్తారని టీడీపీ అభ్యంతరం వ్యక్తం చేయడంతో సీఎం జగన్ స్పందించారు. పంచాయతీరాజ్ చట్ట సవరణ బిల్లుపై గత సమావేశాల్లోనే చర్చ జరిగిందని స్పష్టం చేశారు. అసెంబ్లీలో ఆమోదం పొందిన బిల్లును మండలికి పంపిస్తే దాన్ని వారు తిప్పి పంపారని, అందువల్ల మళ్లీ తిరస్కరించేందుకు వీల్లేదని అన్నారు.
"ఇక్కడ 151 మంది సభ్యులున్న ప్రభుత్వం గతంలో ఏం ఆమోదించిందో, దాన్నే తిరిగి ఆమోదిస్తున్నాం. ఇది లాంఛనం మాత్రమే. ఇదేదో కొత్తగా ప్రవేశపెడుతున్నట్టు టీడీపీ వాళ్లు ప్రవర్తిస్తుండడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఎన్నికల్లో ఎవరూ డబ్బు ఖర్చు చేయకుండా చూడడం కోసం ఈ చట్ట సవరణ చేశాం. ఓటర్లను ప్రభావితం చేసేందుకు డబ్బు ఖర్చు పెడితే వారిపై చర్య తీసుకోవడానికి ఈ చట్టం ఉపకరిస్తుంది. విపక్ష నేత ఏం మాట్లాడుతున్నారో ఆయనకే అర్థంకావడం లేదు" అని సీఎం జగన్ వివరించారు.
కాగా, ఈ పంచాయతీరాజ్ చట్ట సవరణ బిల్లుపై చర్చ జరగకుండానే ఆమోదింప చేసుకున్నారంటూ టీడీపీ సభ్యులు అసెంబ్లీ నుంచి వాకౌట్ చేశారు.