Team India: రెండో వన్టేలోనూ టీమిండియాకు తప్పని ఓటమి... ఆస్ట్రేలియాదే వన్డే సిరీస్

Team India loses second ODI and also series to Australia

  • ఆసీస్ స్కోరు 50 ఓవర్లలో 4 వికెట్లకు 389 రన్స్
  • 50 ఓవర్లలో 9 వికెట్లకు 338 పరుగులు చేసిన భారత్
  • 51 పరుగుల తేడాతో ఓటమి 

సిడ్నీలో ఇవాళ జరిగిన రెండో వన్డేలోనూ భారత జట్టు పరాజయం పాలైంది. మూడు వన్డేల సిరీస్ లో నిలవాలంటే తప్పక గెలవాల్సిన ఈ మ్యాచ్ లో టీమిండియా 51 పరుగుల తేడాతో ఓడింది. అన్ని రంగాల్లో భారత్ పై ఆధిపత్యం ప్రదర్శించిన ఆతిథ్య ఆస్ట్రేలియా 2-0తో సిరీస్ కైవసం చేసుకుంది. 390 పరుగుల భారీ లక్ష్యంతో బరిలో దిగిన భారత్ 50 ఓవర్లలో 9 వికెట్లకు 338 పరుగులు చేసింది.

కెప్టెన్ విరాట్ కోహ్లీ (89) టాప్ స్కోరర్ గా నిలిచాడు. కేఎల్ రాహుల్ (66 బంతుల్లో 76; 4 ఫోర్లు, 5 సిక్సులు) పోరాటం వృథా అయింది. ఓపెనర్లు మయాంక్ 28, ధావన్ 30 పరుగులు చేశారు. పాండ్య 28, జడేజా 24 పరుగులు చేసినా, చివర్లో సాధించాల్సిన రన్ రేట్ విపరీతంగా పెరిగిపోవడంతో భారత టెయిలెండర్లు విఫలయత్నాలు చేశారు.

ఆసీస్ బౌలర్లలో పాట్ కమ్మిన్స్ 3, హేజిల్ వుడ్ 2, ఆడమ్ జంపా 2 వికెట్లు తీశారు. పార్ట్ టైమ్ బౌలర్లు హెన్రిక్స్, మ్యాక్స్ వెల్ చెరో వికెట్ తీశారు. ఇదే మైదానంలో జరిగిన తొలి వన్డేలోనూ ఆస్ట్రేలియా ఘనవిజయం సాధించిన సంగతి తెలిసిందే. ఇక ఇరుజట్ల మధ్య నామమాత్రపు చివరి వన్డే డిసెంబరు 2న కాన్ బెర్రా వేదికగా జరగనుంది.

  • Loading...

More Telugu News