dog: ఆసుపత్రిలోకి వచ్చి అమ్మాయి మృతదేహాన్ని కొరుక్కుతినబోయిన కుక్క.. వీడియో ఇదిగో

dog tries to eat deadbody

  • యూపీలోని సంభాల్‌ జిల్లా ఆసుపత్రిలో ఘటన
  • రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ యువతి
  • అప్పటికే మృతి చెందిందని నిర్ధారించిన వైద్యులు
  • స్ట్రెచర్‌పై మృతదేహాన్ని ఉంచి వెళ్లిపోయిన సిబ్బంది

ఆసుపత్రిలో ఓ అమ్మాయి మృతదేహాన్ని వీధి కుక్క కొరుక్కుతినేందుకు ప్రయత్నించింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలను ఒకరు స్మార్ట్‌ఫోన్‌‌లో వీడియో తీయడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ఆసుపత్రి సిబ్బందిపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని సంభాల్‌ జిల్లా ఆసుపత్రిలో చోటు చేసుకుంది.

ఇందుకు సంబంధించిన వీడియోను సమాజ్ వాదీ పార్టీ తమ ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసి యూపీలోని ఆసుపత్రుల్లో సదుపాయాలు, వైద్య సిబ్బంది నిర్లక్ష్యాలపై తీవ్ర విమర్శలు గుప్పించింది. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలపాలైన ఓ యువతిని ఆసుపత్రికి తీసుకురాగా, అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు పేర్కొన్నారు.

దీంతో ఆమె మృతదేహంపై తెల్లని వస్త్రం కప్పిన ఆసుపత్రి సిబ్బంది స్ట్రెచర్‌పై మృతదేహాన్ని ఉంచి వదిలేశారు. ఓ వీధి కుక్క అక్కడికి వచ్చి ఆ యువతి మృతదేహాన్ని కొరుక్కుతినేందుకు ప్రయత్నించింది. అయితే, ఆ ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యం కారణంగానే తమ కుమార్తె మృతి చెందిందని ఆమె తండ్రి చరణ్‌ సింగ్ ఆరోపణలు చేస్తున్నారు.

తన కూతురిని ఆసుపత్రికి తీసుకొచ్చాక కూడా గంటన్నరపాటు ఒక్క వైద్యుడు కూడా అందుబాటులోకి రాలేదని తెలిపాడు. చికిత్స అందడంలో ఆలస్యం కావడం వల్లే తన కుమార్తె మృతి చెందిందని ఆరోపిస్తున్నాడు. అంతేగాక, వీధి కుక్కలు ఇలా ఆసుపత్రి లోపలికి వస్తున్నప్పటికీ అక్కడి సిబ్బంది పట్టించుకోవడం లేదని తెలిపాడు.

ఆ యువతి మృతదేహాన్ని ఇప్పటికే ఆమె కుటుంబ సభ్యులకు అప్పగించామని ఆసుపత్రి అధికారులు చెబుతున్నారు. ఈ ఘటనలో తమ తప్పేమీ లేదని చెప్పుకొచ్చే ప్రయత్నం చేశారు. ఆసుపత్రిలో అధిక సంఖ్యలో మృతదేహాలు ఉన్నాయని, ఈ నేపథ్యంలో సిబ్బంది అందుబాటులో లేకుండా పోయారని తెలిపారు. ఈ ఘటనపై పూర్తిస్థాయిలో విచారణ జరిపిస్తామని అన్నారు.

  • Loading...

More Telugu News