China: తమ యాప్ లను భారత్ నిషేధించడం పట్ల స్పందించిన చైనా
- 43 యాప్ లపై భారత్ నిషేధం
- జాతీయ భద్రతను ఒక సాకుగా వాడుతున్నారన్న చైనా
- ఇకనైనా వివక్షను వీడాలంటూ చైనా ప్రకటన
భారత్ తాజాగా 43 యాప్ లపై నిషేధాజ్ఞలు విధించడం తెలిసిందే. వీటిలో అత్యధికం చైనా యాప్ లే. దాంతో డ్రాగన్ మరోమారు బుసలు కొట్టింది. కేంద్ర ప్రభుత్వం నిన్న ప్రకటన చేయగా, చైనా ఇవాళ స్పందించింది. భారత్ జాతీయ భద్రతను ఒక సాకుగా ఉపయోగించుకుంటోందని, ఈ వైఖరిని తాము వ్యతిరేకిస్తున్నామని భారత్ లో చైనా అధికార ప్రతినిధి జి రోంగ్ పేర్కొన్నారు.
చైనా నేపథ్యం ఉన్న యాప్ లను నిషేధించిన ప్రతిసారి జాతీయ భద్రత అంశాన్నే ప్రస్తావనకు తెస్తున్నారని ఆరోపించారు. ఇకనైనా భారత్ వివక్షకు తావులేని విధంగా, సరైన వాణిజ్య వాతావరణం నెలకొనేలా చర్యలు తీసుకుంటుందని భావిస్తున్నామని తెలిపారు. విదేశాల్లో కార్యకలాపాలు నిర్వహించే చైనా కంపెనీలు అంతర్జాతీయ నిబంధనలు పాటించేలా చైనా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ఓ ప్రకటనలో రోంగ్ వెల్లడించారు.
బెదిరింపు ధోరణుల కంటే చైనా, భారత్ పరస్పరం అవకాశాలు మెరుగుపర్చుకోవాలని, చర్చలు, ద్వైపాక్షిక ఒప్పందాల ద్వారా వాణిజ్య, ఆర్థిక సంబంధాలను మరింత ముందుకు తీసుకెళ్లాలని తాము ఆకాంక్షిస్తున్నట్టు వివరించారు.