Jallikattu: ఆస్కార్ కు వెళ్లిన మలయాళ సినిమా 'జల్లికట్టు'
- జల్లికట్టు చిత్రాన్ని ఆస్కార్ కు నామినేట్ చేసిన జ్యూరీ
- 27 చిత్రాలను పరిశీలించిన జ్యూరీ సభ్యులు
- మనుషులు, జంతువుల మధ్య సున్నితమైన భావోద్వేగాల 'జల్లికట్టు'
ఆస్కార్ అవార్డులు ప్రధానంగా హాలీవుడ్ సినిమాల కోసం ఉద్దేశించినవే అయినా, ప్రపంచంలోని ఏ భాషా చిత్ర పరిశ్రమకైనా ఆస్కారే పరమావధి. భారత్ లోని సినీ ఇండస్ట్రీలు కూడా అందుకు మినహాయింపు కాదు. మనకు లభించింది వేళ్లమీద లెక్కించదగిన ఆస్కార్ అవార్డులే అయినా సినీ అభిమానులు సంబరాలు చేసుకున్నారు. తాజాగా భారత్ నుంచి మలయాళ చిత్రం జల్లికట్టు ఆస్కార్ కు వెళ్లింది. ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిలిం కేటగిరీ (గతంలో ఉత్తమ విదేశీ చిత్రం)లో భారత్ నుంచి జల్లికట్టు చిత్రాన్ని నామినేట్ చేశారు.
దీనిపై ఫిలిం ఫెడరేషన్ ఆఫ్ ఇండియా జ్యూరీ బోర్డు చైర్మన్ రాహుల్ రావైల్ మాట్లాడుతూ, ఈసారి భారత్ నుంచి ఆస్కార్ నామినేషన్ కోసం మొత్తం 27 సినిమాలు వచ్చాయని, వాటిలో మనుషులు, జంతువుల మధ్య భావోద్వేగాలను అత్యద్భుతంగా చూపిన జల్లికట్టు చిత్రాన్ని నామినేట్ చేశామని వెల్లడించారు.
జల్లికట్టు చిత్రానికి లిజో జోస్ పెల్లిస్సేరి దర్శకత్వం వహించారు. తమిళనాడులో సంప్రదాయ క్రీడ అయిన జల్లికట్టు నేపథ్యంలో వచ్చిన ఈ సినిమాలో ఆంటోనీ వర్గీస్, చెంబన్ వినోద్ జోస్, సబుమోన్ అబ్దుస్సమద్ ముఖ్యపాత్రలు పోషించారు.